- హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త..
- కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..
- 60 కొత్త కోచ్ లను కొనుగోలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ నగరంలో మెట్రో ప్రయాణికులకు త్వరలోనే పెద్ద ఊరట లభించనుంది. నిత్యం ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోతున్న మెట్రో రైళ్లలో ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 60 కొత్త కోచ్‌లను కొనుగోలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు అవసరమైన ప్రక్రియను వేగవంతం చేసింది. బెంగళూరుకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్) నుంచి ఈ కోచ్‌లను కొనుగోలు చేయనున్నారు. ఈ వారంలోనే హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ, బీఈఎంఎల్ మధ్య అధికారిక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని మూడు కారిడార్లలో మొత్తం 56 రైళ్లు సేవలందిస్తున్నాయి. ఒక్కో రైలుకు మూడు కోచ్‌లు మాత్రమే ఉండటంతో ప్రతిరోజూ ప్రయాణించే దాదాపు 5 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఎల్బీనగర్ – మియాపూర్, నాగోల్ – రాయదుర్గం మార్గాల్లో రైళ్లలో నిలబడటానికి కూడా చోటు దొరకని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అదనపు కోచ్‌ల కొనుగోలు అనివార్యంగా మారింది.
ఆర్డర్ ఇచ్చిన నాటి నుంచి కేవలం 15 నెలల వ్యవధిలోనే కొత్త కోచ్‌లను సరఫరా చేస్తామని బీఈఎంఎల్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. గతంలో రద్దీని అధిగమించేందుకు నాగ్‌పూర్ మెట్రో నుంచి కొన్ని కోచ్‌లను లీజుకు తీసుకోవాలని ప్రయత్నించినా, సాంకేతిక కారణాలతో అది ముందుకు సాగలేదు. అయితే, ఇటీవల హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి రావడంతో కోచ్‌ల కొనుగోలుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో బీఈఎంఎల్‌కు ఆర్డర్ ఇచ్చే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.
