- ఎమ్మార్పీ కి మించి వసూళ్లు …
- ఆలయ ప్రాంగణంలోనే బహిరంగ మద్యం విక్రయాలు
- ప్రశ్నించిన భక్తులకు వ్యాపారస్తుల దురుసు సమాధానాలు
- చూస్తూ ఊరుకుంటున్న అధికారులు
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఆడెల్లి మహా పోచమ్మ ఆలయం లో భక్తులపై వ్యాపారస్తుల దోపిడి రోజురోజుకు పెరుగుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి వచ్చే వేలాది మంది భక్తులను లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యాపారులు ఎమ్మార్పీ ధరలకు మించి వస్తువులు విక్రయిస్తూ అధిక వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా ఆలయ పరిసరాల్లోనే విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయని భక్తులు మండిపడుతున్నారు.
పోలీసు అధికారులు ఎదురుగానే కొందరు కౌంటర్లపై మద్యం బాటిళ్లు పెట్టుకుని బహిరంగంగా విక్రయాలు నిర్వహిస్తున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అధిక ధరలు ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించిన భక్తులకు “ఎవరికి ఫిర్యాదు చేసుకుంటారో చేసుకోండి” అంటూ వ్యాపారస్తులు దురుసుగా సమాధానం ఇస్తున్నారని సమాచారం. దీంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఆలయానికి వచ్చే భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, విశ్రాంతి వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం మరో సమస్యగా మారింది. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుణ్యక్షేత్ర పవిత్రతను కాపాడాలని, ఎమ్మార్పీకి మించి వసూళ్లు చేస్తున్న దుకాణాలపై చర్యలు తీసుకోవాలని, ఆలయ పరిసరాల్లో మద్యం విక్రయాలను వెంటనే నిలిపివేయాలని భక్తులు ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను కోరుతున్నారు.
