- బహిర్గతమైన సంస్కృతి స్కూల్స్ అక్రమాలు..
- సి.బీ.ఎస్.ఈ. – నిబంధనలు తుంగలో తొక్కి విస్తరణ
- అధికారుల మౌనం.. తల్లిదండ్రులపై 1 ఫీజుల భారం..
విద్య అనేది అజ్ఞానాన్ని పోగొట్టే పవిత్ర యజ్ఞం కావాలి.. కానీ నేడు అది కాసులు కురిపించే ‘కార్పొరేట’ కల్పవృక్షంగా మారిపోయింది. పేద, మధ్యతరగతి తల్లిదండ్రుల ఆశలను పెట్టుబడిగా మార్చుకుంటూ, నిబంధనలను తుంగలో తొక్కుతున్న విద్యా సంస్థల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. రంగారెడ్డి జిల్లా కొండాపూర్ కేంద్రంగా సాగుతున్న ‘సంస్కృతి ఎడ్యుకేషనల్ సొసైటీ’ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర విద్యాశాఖ లో పెను సంచలనంగా మారింది.
చట్టానికి ఉన్న లొసుగులను వాడుకుంటూ, ప్రభుత్వ అనుమతులను ఎగవేస్తూ ఈ సొసైటీ సాగిస్తున్న మాయాజాలం విస్తుగొలుపుతోంది. కేవలం ఒకే ఒక్క అనుమతిని అడ్డం పెట్టుకుని, గొలుసుకట్టు విధానంలో అక్రమంగా అనేక బ్రాంచీలను నడుపుతూ, నిబంధనలను బేఖాతర్ చేస్తోంది. ఇది కేవలం సాంకేతిక తప్పిదం మాత్రమే కాదు.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న పక్కా ప్రణాళికాబద్ధమైన ‘విద్యా దందా’. విద్యాశాఖ నిబంధనలను గాలికొదిలేసి, అధికారుల కళ్లు గప్పి ఈ సొసైటీ సాగిస్తున్న విద్యా వ్యాపారంపై ‘ఆదాబ్ హైదరాబాద’ అందిస్తున్న ఇన్వెస్టిగేటివ్ స్పెషల్ స్టోరీ..



రంగారెడ్డి జిల్లా కొండాపూర్ కేంద్రంగా నడుస్తున్న ‘సంస్కృతి ఎడ్యుకేషనల్ సొసైటీ’ వ్యవహారం ఇప్పుడు విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. ఒకే అనుమతితో అక్రమంగా అనేక బ్రాంచీలను నడుపుతూ, నిబంధనలను బేఖాతర్ చేస్తూ ఈ యాజమాన్యం సాగిస్తున్న విద్యా దందా విస్తుపోయేలా చేస్తోంది..
- అనుమతి ఒక చోట.. పాఠాలు మరోచోట :
సి.బీ.ఎస్.ఈ., అదేవిధంగా స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డు నిబంధనల ప్రకారం, ఒక అఫిలియేషన్ నంబర్ అనేది ఒక నిర్దిష్ట చిరునామాకు, ఒకే ప్రాంగణానికి మాత్రమే పరిమితం. కొండాపూర్‌లోని గోల్డెన్ టులిప్ ఎస్టేట్స్‌లో గల ప్లాట్ నం. 16, 16A, 17లకు మాత్రమే సి.బీ.ఎస్.ఈ. అఫిలియేషన్ నెంబర్ : 3630118 ఉంది. కానీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.. అనుమతి పొందిన ప్రాంగణం తో పాటు, ప్లాట్ నం. 106 నుండి 117 వరకు అక్రమంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు.
అదే పేరుతో మియాపూర్, హఫీజ్‌పేట్ (గోపాల్ నగర్), మయూరి నగర్ వంటి ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా బ్రాంచీలు నడుపుతున్నారు. నల్లగండ్ల, మాదాపూర్, మణికొండ, కూకట్‌పల్లి, కొంపల్లి ప్రాంతాల్లో “సంసృతి గ్లోబల్ ప్రీ స్కూల్ “పేరుతో ఎలాంటి అనుమతులు లేని ప్లే స్కూల్స్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.

- ఫీజుల దోపిడీ.. పుస్తకాల దందా :
తల్లి దండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకుని, ఒక్కో విద్యార్థి నుండి రూ. 1.25 లక్షల నుండి రూ. 1.70 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా ఎస్.ఏ.ఈ. బుక్స్ పేరుతో కేవలం పుస్తకాల కోసమే రూ. 18,000 అదనంగా వసూలు చేస్తున్నారు. కాగా నిబంధనల ప్రకారం పుస్తకాలను బయట కొనుగోలు చేసే అవకాశం ఉన్నా, స్కూల్‌లోనే కొనాలని నిబంధన పెట్టడమే కాకుండా.. ఫస్ట్ టర్మ్ ఫీజు చెల్లిస్తేనే పుస్తకాలు ఇస్తామంటూ షరతులు విధించడం యాజమాన్యం అహంకారానికి నిదర్శనం.
- అధికారుల మౌనం.. ఎవరి కోసం? :
క్షేత్రస్థాయిలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు అంటే ఎంఈఓ, డీఈఓలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మతలబు ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎంఈఓ, డీఈఓలు తనిఖీలు నిర్వహించి, అనుమతి లేని బ్రాంచీలపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇక కలెక్టర్ జిల్లా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ఉన్నా, ఈ అక్రమ స్కూళ్లపై దృష్టి పెట్టకపోవడం ఆందోళనకరం.
- రిస్క్ లో విద్యార్థుల భవిష్యత్తు :
గుర్తింపు లేని క్యాంపస్‌లలో చదువుతున్న విద్యార్థులకు భవిష్యత్తులో సర్టిఫికెట్ల చెల్లుబాటు విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే విద్యార్థి సంఘం నేత పల్లె మురళి, రణధీర్ లు ఈ అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఇలాంటి అక్రమ స్కూల్స్ నెట్‌వర్క్ వేల కోట్లలో సాగుతోందని వారు ఆరోపిస్తున్నారు.
- “ పేరు ఒకటే.. ప్రాంగణాలు అనేకం..
ఇది విద్య కాదు, వ్యాపారం !” :
ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఈ ‘సంస్కృతి’ స్కూల్ అక్రమ బ్రాంచీ లపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరో కథనం ద్వారా మై స్కూల్ ఇటలీ అక్రమ లీలలు ఆధారా లతో సహా వెలుగులోకి తీసుకుని రానుంది
