- జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య
ప్లాస్టిక్ వాడకం నిషేధంపై ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం తాటిగూడ గ్రామపంచాయతీని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు తో కలిసి సందర్శించి గ్రామ పంచాయతీ పరిధిలోని రహదారులు, మురుగు కాలువలు, ఓపెన్ వెల్స్, సామాజిక ఇంకుడు గుంతలు పరిశీలించారు. ఈ సందర్భంగా
జిల్లా ఆదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని తెలిపారు. గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచాలని, పూర్తి పని దినాలు కల్పించాలని తెలిపారు.
ప్లాస్టిక్ వాడక నిషేధం గురించి అవగాహన కల్పిస్తూ గ్రామపంచాయతీలో జరిగే గ్రామ ప్రజల శుభ కార్యక్రమాలకు, ఇతర చిన్న చిన్న కార్యక్రమాలకు కేవలం స్టీల్, అల్యూమినియం, ఇత్తడి వస్తువులను మాత్రమే వినియోగిస్తున్న విషయం తెలుసుకుని గ్రామపంచాయతిని ఆకస్మికంగా సందర్శించి వినియోగిస్తున్న వస్తువులను పరిశీలించి వివరాలు ప్రజలను అడిగి తెల్సుకొని గ్రామ పంచాయతీ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిని అభినందించారు.
అనంతరం మండలంలోని గట్రావుపల్లి గ్రామ పంచాయతీ సాలేగూడ గొండ్వానా పంచాయతీ రాయి సెంటర్ కేంద్రాన్ని సందర్శించి అమరవీరుడు కొమురంభీమ్ కు నివాళులు అర్పించి రాయి సెంటర్ కమిటీ సభ్యులు, గ్రామస్థులతో ముఖా ముఖి కార్యక్రమానికి హాజరయ్యారు. రాయి సెంటర్ విధి విధానాలు, ఉపాధి హామీ పథకం పనులపై అధికారులు సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సునీల్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ సింగ్, మండల పంచాయతీ అధికారి సఫ్దర్ అలీ, పంచాయతీ కార్యదర్శి మౌనిక, తాటిగూడ సర్పంచ్ మడావి వెంకటేష్, ఉపసర్పంచ్ తమ్మినేడి విజయలక్ష్మి, శ్యామ్ శేఖర్, రాయి సెంటర్ కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు
