- ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీ.జె.వై.ఎం. రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ కుమార్..
పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలి –రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) రాష్ట్ర కార్యదర్శి కుమ్మరి ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ పథకంపై ఆధారపడి ఉన్నత విద్యను కొనసాగిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా వారి భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతోందని ఆయన విమర్శించారు.
ఇప్పటికే వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాదులో ఇటీవలి కాలంలో ఫీజులు చెల్లించలేక, సర్టిఫికెట్లు పొందలేక అనేక మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పై చదువులకు వెళ్లలేక, ఉద్యోగ అవకాశాలు కోల్పోయి, కుటుంబాలకు భారంగా మిగిలిపోతున్న విద్యార్థుల పరిస్థితి అత్యంత విషాదకరమని అన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ఇలా ఆటలాడటం ఏ మాత్రం సహించబోదని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే తన మొండి వైఖరిని విడిచిపెట్టి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి, విద్యార్థుల హక్కుల కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం రాష్ట్ర భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడమేనని, ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
