జిల్లా కేంద్రంలోని తారకరామ్‌నగర్,సోఫీనగర్ వీధిలో సోమవారం వీధికుక్కలు స్వైర విహారం చేస్తూ చిన్నారులపై దాడికి పాల్పడడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఒకేసారి ఐదుగురు పిల్లలను వీధికుక్కలు కరిచిన ఘటన కలకలం రేపింది. గాయపడిన చిన్నారులను కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
స్థానికుల వివరాల ప్రకారం, ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో వీధికుక్కల సంఖ్య గణనీయంగా పెరిగిందని, గుంపులుగా తిరుగుతూ పాదచారులు, చిన్నారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని తెలిపారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు,ఆటల కోసం బయటకు వచ్చే పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీధికుక్కల సంచారం కారణంగా ఉదయం,సాయంత్రం వేళల్లో ప్రజలు బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు.


ఈ ఘటనతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, పిల్లలను ఒంటరిగా బయటకు పంపేందుకు భయపడుతున్నామని తెలిపారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి వీధికుక్కలను పట్టుకునే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రజలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వీధికుక్కల నియంత్రణపై తక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం గాయపడిన చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
