బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు థార్ వాహనంతో ఐదుగురిని ఢీకొట్టాడు. అయితే ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారిని ఆ బీజేపీ ఎమ్మెల్యే బెదిరించారు. ‘నీ నాన్నకు దమ్ముంటే’ ఆ ప్రాంతంలో తన కుమారుడిని అడ్డుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ లోధి కుమారుడు దినేష్ లోధి ఏప్రిల్ 16న శివపురి జిల్లాలోని కరేరాలో వేగంగా థార్ వాహనం నడిపాడు. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు రోడ్డు పక్కన నడుస్తున్న ఇద్దరు మహిళలపైకి ఆ వాహనాన్ని దూకించి ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో ఆ ఐదుగురు గాయపడ్డారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తన కుమారుడు చేసిన ఈ ప్రమాదం కేసుపై దర్యాప్తు చేస్తున్న కరేరా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్‌డీఓపీ) ఆయుష్ జాఖర్‌ను బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ లోధి బహిరంగంగా బెదిరించారు. ‘కరేరా ఎస్‌డీఓపీ మాటలను నేను జీర్ణించుకోలేకపోతున్నా. నా కొడుకు మళ్లీ ఇక్కడ కనిపించవద్దని ఆయన హెచ్చరించారు.
నేను ఎస్‌డీఓపీని అడగాలనుకుంటున్నా. కరేరా మీ ‘నాన్నదా?’ సాధారణంగా నేను ఇలా అనను. కానీ ఇప్పుడు స్పష్టం చేయాలనుకుంటున్నా. నా కొడుకు కరేరాకు తిరిగి వస్తాడు. ఎన్నికల్లో పోటీ చేస్తాడు. మీ ‘నాన్న’కు దమ్ముంటే ఆపడానికి ప్రయత్నించమను’ అని సవాల్ విసిరారు. అంతేగాక ఆ పోలీస్ అధికారిపై ప్రతీకార చర్యలు తీసుకుంటామని కూడా బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ లోధి హెచ్చరించారు.
