- అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ తేజస్వి సూర్య..
- బీజేపీ ఆఫీసును ముట్టడించిన బీ.ఆర్.ఎస్.వీ.
కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్వీ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించింది. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ విభజనను పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను, తెలంగాణ ప్రజల మనోభావాలను బీజేపీ ఎంపీ కించపరిచాడని అన్నారు.
తన వ్యాఖ్యలకు గాను బీజేపీ ఎంపీ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. బీజేపీ కార్యాలయం ఎదుట తేజస్వీ సూర్య చిత్రపటాన్ని దగ్ధం చేశారు. బీజేపీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నేతల హంగామా నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు బీఆర్ఎస్వీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.
కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. తెలంగాణ, ఏపీ విభజనను భారత-పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ వ్యాఖ్యలు చేయడానికి నిరసనగా బీజేపీ ఎంపీపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఫిర్యాదు చేయనున్నారు.
