- హర్షం వ్యక్తం చేసిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు..
- సంపూర్ణ మద్దతు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ..
దేశాభివృద్ధిలో సగభాగంగా ఉన్న మహిళల చిరకాల స్వప్నం నెరవేరబోతోందని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొని, తమ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగడం అనేది కేవలం ఒక చట్టం మాత్రమే కాదని, అది కోట్లాది మంది మహిళల ఆకాంక్షలకు దక్కిన గౌరవమని ఆయన అభివర్ణించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఈ చారిత్రాత్మక బిల్లు అమలు కాబోతుండటం అభినందనీయమన్నారు.
డీలిమిటేషన్ అంశంపై కూడా టీడీపీ తన స్పష్టమైన వైఖరిని చాటింది. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళనలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. లోక్‌సభ స్థానాల సంఖ్య పెరిగినప్పటికీ, రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య నిష్పత్తిలో మార్పు ఉండబోదని, దీనిపై ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టత ఇచ్చారని గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు డీలిమిటేషన్ ఒక కీలక అడుగని, దీనివల్ల మహిళలతో పాటు యువతకు కూడా రాజకీయాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా సాధికారత కోసం ఎన్నో ఏళ్లుగా సాగుతున్న పోరాటాలకు ఈ బిల్లుతో ఒక తార్కిక ముగింపు లభిస్తుందని లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు.
