- జనగామలో ఘనంగా 200వ జయంతి వేడుకలు
సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారత కోసం మహాత్మా జ్యోతిరావు ఫూలే చూపిన మార్గంలో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. శనివారం జనగామ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫూలే చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జ్యోతి వెలిగించి, పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి ఫూలే చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ విద్య అందించాలనే సంకల్పంతో ఆయన చేసిన పోరాటం నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు.

విద్య ద్వారా మాత్రమే సమాజంలో అసమానతలను తొలగించవచ్చని, ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ఫూలే ఆశయమని గుర్తుచేశారు. అనంతరం డీసీపీ రాజ మహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్, ఇతర అధికారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, సిబ్బంది ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఎన్.ఎల్. నరసింహరావు, ఏబీసీడీఓ రవీందర్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సిద్దయ్య గౌడ్, పండుగ హరీశ్, చిర్రా వీరస్వామి, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల బాలరాజు, యాదవ సంఘం జనరల్ సెక్రటరీ మేకల సమ్మయ్య, గంటె ఉపేందర్ యాదవ్, సేవాదళ్ టౌన్ అధ్యక్షుడు బిర్రు సత్యనారాయణ, విశ్వబ్రాహ్మణ సంఘం జనరల్ సెక్రటరీ కృష్ణమూర్తి, కురుమ సంఘం జనరల్ సెక్రటరీ మల్లేష్, రెడ్ క్రాస్ అధ్యక్షుడు కన్నా పరశురాములు, విశ్వకర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు రామేశ్వరాచారి, నరసింహచారి, టీకేవీఎస్ వైస్ ప్రెసిడెంట్ అభినాష్ నంద, బీసీ జేఏసీ కో-కన్వీనర్ మంగళంపల్లి రాజు, కేజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ వెంకట మల్లయ్య గౌడ్, దిశ సభ్యుడు బక్క శ్రీనివాస్, బీసీ వసతి గృహాల అధికారులు, బీసీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
