- ఖతార్ వెళ్లేందుకు సిధమైన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి..
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ.. దేశీయంగా ఇంధన కొరతపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురి ఖతార్ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఇవాళ, రేపు ఖతార్‌లో పర్యటించనున్నట్లు సంబంధిత శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది. అయితే పురి పర్యటనకు సంబంధించిన స్పష్టమైన కారణాన్ని మాత్రం వెల్లడించలేదు.
కాగా ఇరాన్ ప్రతీకార దాడులకు గురైన గల్ఫ్ దేశాల్లో ఖతార్ కూడా ఒకటిగా ఉన్నది. ఈ దాడుల నేపథ్యంలో ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తి, ఎగుమతులను ఖతార్ అధికారులు నిలిపివేశారు. తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఉత్పత్తులను పునఃప్రారంభించాలని అక్కడి అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పరిమిత కార్యకలాపాలే నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు అధికార వర్గాలను ఉటంకిస్తూ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పురి ఖతార్‌కు వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 11-12 తేదీల్లో జైశంకర్ పర్యటన ఉండనున్నట్లు సంబంధిత శాఖ పేర్కొన్నది. యుద్ధం నేపథ్యంలో ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో.. భారత్‌లో ఇటీవల ఎల్‌ఎన్‌జీ కొరతపై ఆందోళనలు వెల్లువెత్తాయి. అయితే కేంద్రం ఈ ఆందోళనలను కొట్టిపారేసింది. దేశంలో తగినన్ని నిల్వలు ఉన్నాయని, కొరత ఏర్పడుతుందంటూ జరుగుతున్న ప్రచారాలు నిరాధారమైనవని స్పష్టంచేసింది.
