ప్రభుత్వ బడి మేడలో
ఒకప్పుడు గంట మోగితే
గ్రామం మొత్తం భవిష్యత్తు
ప్రజల గుండెల్లో విలసిల్లేది..!
ఇప్పుడు ఆ గంట శబ్దం
గాలిలో కలిసిపోతుంది..
కిటికీ గాజులపై దుమ్ము మాత్రమే
హాజరు తీసుకుంటుంది.
చాక్ ధూళిలో….
గురువు స్వప్నాలను నిజం
చేసే పనిలో ఉన్నాడు
బ్లాక్‌బోర్డ్ ముందున్న ఖాళీ బెంచీలు
దేశ భవిష్యత్తును నిలబెడుతున్నాయి.
ఒక వైపు కార్పోరేట్ పాఠశాలల
ఎత్తైన గేట్లు,రంగురంగుల బస్సులు,
ఇంగ్లీష్ ప్రకటనల జోరును
“అడ్మిషన్ ఓపెన్” అంటూ
తల్లిదండ్రుల ఆశలను కొనుగోలు చేస్తున్నవి.
ఫీజు రశీదుల్లో
పిల్లల కలలు బంధింపబడి,
ఈఎంఐ లెక్కల్లో
తండ్రి నిద్ర తరిగిపోతుంది..
అమ్మ ఒళ్ల్లో
అవసరాల కన్నీళ్లు
స్థిమితంగా జారిపోతున్నవి…
ప్రభుత్వ బడి
పేదల ఆశ్చర్యమే కాదు…!
దేశ సమానత్వపు ఆలయం..!
నిధుల కన్నా నిర్లక్ష్యానికి గురై
గోడలు కూడా
ఆత్మవిశ్వాసం కోల్పోతున్నాయి.
పుస్తకాలు ఉచితం,
భోజనం ఉచితం,
కానీ గౌరవం మాత్రం
ఎక్కడో మధ్యలో అడుగంటుతున్నది..
సదుపాయాల లోపం
ప్రతిభను మౌనంగా వలసకు పంపుతోంది.
కార్పోరేట్ విద్య
జ్ఞానం కంటే బ్రాండ్‌గా మారి..
సిలబస్ కంటే స్టేటస్ నేర్పుతోంది…!
ప్రభుత్వ పాఠశాలలు పతనమైతే..!
సమాజ విలువల అద్దం పగిలిపోవడమే…
గంట ఇంకా మోగుతోంది…వింటున్నామా?
లేక ఫీజు రశీదుల శబ్దంలో..భవిష్యత్తు పిలుపు…
మరుగున పడుతున్నదా??
