- సీఎం భూములు గుంజుకుంటున్నారు..
- మహేశ్వరంలో వేల ఎకరాలు కబ్జా చేస్తున్నారు..
- తీవ్ర ఆరోపణలు గుప్పించిన కేటీఆర్..
సీఎం రేవంత్ రెడ్డి పలుకుబడిని అడ్డుపెట్టుకుని భూములు గుంజుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. భూమి బౌండరీలను మార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మహేశ్వరం నియోజకవర్గంలో వేల ఎకరాలు కబ్జా చేస్తున్నారని తెలిపారు. అధికారులను అడ్డుపెట్టుకుని అరాచకపర్వం చేపడుతున్నారని మండిపడ్డారు. కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారని అన్నారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో కేటీఆర్ సహా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పర్యటించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూ కబ్జా బాధితులను పరామర్శించారు. భూ కబ్జాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాడుతుందని బాధితులకు భరోసానిచ్చారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వట్టనాగులపల్లిలో సతీశ్ షా కుటుంబం 60 ఏళ్లుగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రూ.1400 కోట్ల విలువ చేసే భూమిపై పొంగులేటి కన్ను పడిందని పేర్కొన్నారు. స్థలం ఇచ్చే ఉద్దేశం లేదని షా కుటుంబం తెలిపిందని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డులో మీ ల్యాండ్ పోయిందని బెదిరింపులకు గురి చేశారని చెప్పారు. ఓ అక్రమార్కున్ని అడ్డం పెట్టుకుని 27 ఎకరాల భూమిని గుంజుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
జేసీబీలతో వచ్చి గోశాలను కూల్చేశారని.. కాంపౌండ్ వాల్ కూలగొట్టారని అన్నారు. సతీశ్ షాను ఇక్కడే సజీవంగా పాతిపెడతామని బెదిరించారని తెలిపారు. అజీబుల్లా ఖాన్ అనే సిన్సియర్ అధికారి వీరికి రక్షణ కల్పించారని పేర్కొన్నారు. తెల్లారే ఆ నిజాయితీ పోలీసు అధికారిని ట్రాన్స్‌ఫర్ చేశారని చెప్పారు.
సతీశ్ షా వంటి ఎందరో బాధితులు ఇంకా ఉన్నారని కేటీఆర్ తెలిపారు. నేనే రాజు.. నేనే మంత్రి.. మా రాజ్యం ఇష్టమొచ్చినట్లు చేస్తామనేలా ధిక్కార ధోరణితో రాష్ట్రంలో గూండాగిరి రాజ్యం కొనసాగుతుందని మండిపడ్డారు. పొంగులేటి అక్రమాలపై సభాసంఘం వేయమని కోరుతున్నామని అన్నారు. వందల క్రషర్లు కొనసాగుతున్నాయని, సభా సంఘం వేయాలని కోరుతున్నామని తెలిపారు. కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చడంపై గవర్నర్ వద్దకు వెళ్తామని స్పష్టం చేశారు. అవసరమైతే కోర్టుకు వెళ్తామని.. న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు.
