- శ్రీ రామ నవమి సందర్భంగా సేవా కార్యక్రమం
గ్రేటర్ హైదరాబాద్ జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలోని చంద్రపురి కాలనీ 2వ డివిజన్ మదర్ థెరిస్సా వికలాంగుల కాలనీ చౌరస్తాలో శుక్రవారం శ్రీ రామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని చలివేంద్రం ఏర్పాటు చేశారు. బూడిద శ్రీకాంత్ జ్ఞాపకార్థంగా మదర్ థెరిస్సా కాలనీ అధ్యక్షుడు బూడిద ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ చలివేంద్రాన్ని మాజీ కార్పొరేటర్ కారింగుల నిహారిక వెంకట్ గౌడ్, మాజీ సర్పంచ్ కారింగుల జ్యోతి శంకర్ గౌడ్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లె పువ్వుల శ్రీకాంత్ యాదవ్, మేడ్చల్ విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు భాషపల్లి రమేష్ చారి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మొదటి రోజు కావడంతో స్థానిక ప్రజలకు మజ్జిగ అందజేశారు. అనంతరం నిహారిక వెంకట్ గౌడ్, జ్యోతి శంకర్ గౌడ్ మాట్లాడుతూ వేసవి కాలంలో దారిన వెళ్లే ప్రజల దాహాన్ని తీర్చేందుకు ఇలాంటి చలివేంద్రాలు అవసరమని తెలిపారు.
బూడిద వెంకటేష్ సహా మరికొందరు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి అవసరమైన ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. వికలాంగులు, వృద్ధులు, ప్రయాణికులు ఎండాకాలంలో మంచినీటి కోసం ఇబ్బంది పడకూడదని అన్నారు. తన కుమారుడు బూడిద శ్రీకాంత్ జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని, వారానికి ఒక రోజు మజ్జిగ, మిగతా రోజుల్లో చల్లని నీటిని అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం అధ్యక్షుడు చెన్నాపురం యాదయ్య, మహేందర్ యాదవ్, మాట్ల వినయ్, భాస్కర్ గౌడ్, కిషోర్, దివాకర్, మంజుల, రవి, శ్రీను, వెంకటేష్, కిరణ్, భరత్, మీనాక్షి, బాలమురళి, బాబు, సంతోష్ గౌడ్ తదితర కాలనీ వాసులు పాల్గొన్నారు.
