జవహర్ నగర్ బిజెపి అధ్యక్షుడు కళికోట కమలాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ కాప్రా ఎమ్మార్వోకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు, మేడ్చల్ జిల్లా రూరల్ బిజెపి అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ పిలుపు మేరకు తహసిల్దార్‌కు వినతిపత్రం అందజేసినట్లు కమలాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు భారీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాలను విస్మరించిందని తీవ్రంగా విమర్శించారు.
100 రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించిన ఆరు గ్యారంటీలు రెండు సంవత్సరాలు గడిచినా పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం సిగ్గుచేటని అన్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రూ.2,500 అందిస్తామని చెప్పి ఇప్పటికీ అమలు చేయకపోవడం మహిళలను మోసం చేసినట్లేనని పేర్కొన్నారు. ఎకరాకు రూ.15,000 పెట్టుబడి సాయం అందిస్తామని రైతులకు హామీ ఇచ్చినా పాత పథకాలను కూడా సరిగా అమలు చేయలేదని విమర్శించారు. ఐదు లక్షల విద్యార్థులకు భరోసా కార్డులు, నిరుద్యోగ భృతి వంటి హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని తెలిపారు.
రూ.500కే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలు అరకొరగా అమలు చేస్తూ నిబంధనల పేరుతో లక్షలాది మంది అర్హులను జాబితా నుంచి తొలగించడం దారుణమని అన్నారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఆర్థిక ఇబ్బందుల నెపాన్ని గత ప్రభుత్వంపై నెట్టడం హాస్యాస్పదమని ఎద్దేవ చేశారు. హామీలు ఇచ్చేముందు లేని ఆర్థిక అవగాహన ఇప్పుడు ఎందుకు తలెత్తిందో ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న అన్ని గ్యారంటీలను తక్షణమే బేషరతుగా అమలు చేయాలని, లేకపోతే ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేవైఎం నాయకుడు సంతోష్ గుప్తా, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు మహేందర్ యాదవ్, జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షుడు మరాఠి బాబు, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు లిఖిత యాదవ్, మాజీ కార్పొరేటర్ పానుగంటి బాబు, జవహర్ నగర్ మాజీ బీజేవైఎం అధ్యక్షుడు రామ్ నాయక్, బిజెపి ఉపాధ్యక్షురాలు వనబోజు రాజేశ్వరి, ప్రధాన కార్యదర్శులు వేపుల సన్నీ, ముచ్చర్ల యాదగిరి, బీజేవైఎం అధ్యక్షుడు సందీప్ ముదిరాజ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొంపెల్ల చంద్రశేఖర్, మహిళా మోర్చా అధ్యక్షురాలు చింతంరెడ్డి లక్ష్మీ దేవి, పానుగంటి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
