- యాదాద్రి జిల్లా, రాజాపేట మండలం, సోమవారం గ్రామంలో అక్రమ దందా..
- ఫార్మ్ ల్యాండ్ అంటూ మూడు, నాలుగు వెంచర్లు.
- ప్రీ లాంచింగ్ ఆశలు చూపించి నిలువు దోపిడీ..
- ఆకర్షణీయమైన ఆఫర్లతో అమాయకులకు వల..
- శ్రీగంధం చెట్లు పెంచుతామంటూ ఆకర్షణ..
- లక్షల్లో లాభాలొస్తాయంటూ ఆశ చూపిస్తారు..
- ఎలాంటి అనుమతులు లేకున్నా భ్రమ కల్పిస్తారు..
- చట్టానికి విరుద్ధంగా 120 గజాల చొప్పున ప్లాట్ల అమ్మకాలు..
- డబ్బులు కట్టించుకుని ప్లాట్లు ఇవ్వకుండా దగా..
- ఈ.ఎం.ఐ. స్పెషల్ ఈ.ఎం.ఐ. అంటూ కనికట్టు..
- మోసపోయిన బాధితుల అలవిగాని ఆవేదన..
ఫార్మ్ ల్యాండ్ పేరుతో మోసపూరిత వ్యాపారం.. నిబంధనలకు విరుద్ధంగా 120 గజాల చొప్పున విక్రయాలు.. ఈ.ఎం.ఐ., స్పెషల్ ఈ.ఎం.ఐ. అంటూ ఆశలు కల్గించడం.. శ్రీగంధం చెట్లు పెంచుతామని, అధికలాభాలు గడించవచ్చని కహానీలు చెప్పారు.. ఇబ్బడిముబ్బడిగా డబ్బులు కట్టించుకున్నారు.. 20 రూపాయల స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసిచ్చారు.. కానీ నిజానికి వారు చెప్పిన చోట ల్యాండ్ ఉందొ లేదో తెలియదు..
అక్కడ దేవలప్మెట్లు చేస్తున్నారు అన్నది పచ్చి అబద్దం.. ఎంతోమంది అమాయకులకు కుచ్చుటోపీ పెట్టారు.. భవిష్యత్తు అవసరాలకు ఒక స్థిరాస్తి ఉంటుందని ఎంతో మంది అమాయకులు పైసా పైసా కూడబెట్టి ఇలాంటి మోసగాళ్ల చేతుల్లో పోసి కన్నీటి పర్యంతం అవుతున్నారు.

వాస్తవానికి ఒక్క గుంట భూమికి రిజిస్ట్రేషన్ చేయడం అన్నది కూడా రెవెన్యూ చట్టంలో లేదు.. ఆవిధంగా చేయలేమని, చేయకూడదని స్థానిక ఎమ్మార్వోలకు తెలియదా..? తెలిసి కూడా తప్పులు చేస్తున్నారా..? ఒకవేళ 120 గజాలకు అంటే ఒక్క గుంట చొప్పున రిజిస్ట్రేషన్స్ చేసుకుంటూ పోతే.. ఎంత ప్రభుత్వ సంపద ఆవిరైపోతుంది..? ఎన్ని దస్త్రాలు తయారవుతాయి..? ఎన్ని పాస్ బుక్స్ ఇష్యూ చేయాల్సి వస్తుంది.. ? ఇంత అవగాహన లేకుండా రెవెన్యూ శాఖ నిద్రపోతోందా..? ప్రభుత్వం ఏమి చేస్తోంది.. అమాయకులు బలైపోతుంటే ఎవరూ పట్టనట్లు ఉండటం శోచనీయం.. అలాగే ఎన్నో సంవత్సరాలుగా ఫార్మ్ ల్యాండ్స్ అంటూ..
శ్రీగంధం చెట్ల పెంపకం అంటూ.. ఇంకా ఏవేవో చెబుతూ వేలమంది అమాయకులను మోసం చేస్తున్న ఇలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలను ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్ధం కాదు.. ప్రభుత్వం, అధికారుల ఉదాశీనతను ఆసరాగా చేసుకుని ఇలాంటి మోసగాళ్లు రోజు రోజుకూ విజృంభిస్తున్నారు.. ఈ పద్దతికి చరమాంకం పాడే వారు లేకపోవడం మనం చేసుకున్న పాపమా..? కలిసిరాని అదృష్టమా..? చుట్టుముట్టుతున్న దురదృష్టమా..? అదేవిధంగా డీటీసీపీ, హెచ్.ఎం.డీ.ఏ. అనుమతులతో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ బౌండరీస్ ఏర్పాటుచేసిన ప్లాట్ల విషయంలోనే కొన్నవారికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి..
ఎన్నెన్నో గొడవలు జరుగుతున్నాయి కోర్టుల్లో కేసులు జరుగుతున్నాయి.. అలాంటిది గుంట భూమికి ఏవిధంగా హద్దులు నిర్ణయిస్తారు..? ఎలా ఈ ప్లాట్లను అమ్ముతారు..? ఇంత దారుణం జరుగుతోంది అంటే అమాయక ప్రజలను మోసం చేస్తున్నట్లే కదా..? ఈ వాస్తవాన్ని గ్రహించే నాథుడు లేకపోవడం దురదృష్టం.. యాదాద్రి జిల్లా, రాజాపేట మండలం, సోమవారం గ్రామంలో వెలుగు చూసిన ఈ ఫార్మ్ ల్యాండ్ దందా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. శ్రీ సంపద డెవలపర్స్ అధినేత రమేష్ రసాల ఆడుతున్న అవినీతి ఆటను ఆదాబ్ పాఠకుల కోసం..

పేరు శ్రీ సంపద డెవలపర్స్ సాక్షాత్తూ లక్ష్మీదేవి పేరుపెట్టుకుని అక్రమ ఫార్మ్ ల్యాండ్ దందాకు తెరలేపారు రమేష్ రసాల.. యాదాద్రి జిల్లా, రాజాపేట మండలం, సోమవారం గ్రామంలో మూడు, నాలుగు ఫార్మ్ ల్యాండ్ వెంచర్స్ వేశారు.. చట్టానికి విరుద్ధంగా 120 గజాల చొప్పున ప్లాట్లు విక్రయానికి పెట్టి, అక్కడ శ్రీగంధం చెట్లు పెంచుతామని, దానితో లక్షల్లో లాభాలు ఆర్జించవచ్చని ఆశచూపి, మరెన్నో సౌకర్యాలు కల్పిస్తామని, రంగురంగుల బ్రోచర్లు, ప్రకటనలు గుప్పించి, కేవలం 20 రూపాయల స్టాంప్ పేపర్లపై సేల్ అగ్రిమెంట్ చేస్తూ అమాయకుల వద్ద నుంచి అప్పనంగా డబ్బులు గుంజారు.. కానీ అసలు అక్కడ ల్యాండ్ ఉందా..?
లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.. ఎందుకంటే డబ్బులు వసూలు చేసిన కస్టమర్లకు దాదాపు నాలుగు సంవత్స రాల కాలం దాటిపోయినా ఇప్పటి వరకు భూమి స్వాధీనం చేయలేదు.. రిజిస్ట్రేషన్ చేయలేదు.. ఏవో కారణాలు చెబుతూ కాలం వెళ్లబుచ్చుతున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు..
కాగా ఇదే బాధితుడైన ఒక వ్యక్తి 2020 మార్చి నెలలో రూ. 20 వేలు చెల్లించాడు దానికి ఒక రసీదు ఇచ్చారు.. మరలా అదే విధంగా 2020లోనే అక్టోబర్ నెలలో మరో 5 వేల రూపాయలు చెల్లిం చాడు.. మరోసారి అదే సంవత్సరంలో రూ. 34 వేలు చెల్లిం చాడు.. ఇవన్నీ నగదు రూపంలో చెల్లించడం జరిగింది.. దానికి సంబంధించిన రసీదులు కూడా పొందడం జరిగింది.. కానీ ఇప్పటి వరకు శ్రీ డెవలపర్స్ వారు ఎలాంటి ల్యాండ్ ను చూపించలేదు.. అడిగితే సమాధానం కూడా ఇవ్వడం లేదని బాధితుడు వాపోతున్నాడు.
నిజానికి ఫార్మ్ ల్యాండ్ వెంచర్ లో 120 గజాల చొప్పున ప్లాట్లు విక్రయించ డమే నేరం.. దానికితోడు 20 రూపాయల బ్యాండ్ పేపర్ పై సెల్ అగ్రిమెంట్ చెయ్యడం, ఒక ప్రింటెడ్ క్యాష్ రిసెప్ట్ ఇవ్వడం.. నాలుగు సంవత్స రాలు పైగా గడిచిపోయినా ప్లాట్లు వున్నవారికి ప్లాట్స్ అప్పగించకపోవడం మరో పెద్ద నేరం.. అభూత కల్పనతో బ్రోచర్లు ముద్రించి, అలవుగాని హామీలు గుప్పించి, ఆచరణలో సాధ్యం కానీ సౌకర్యాలు, అధికలాభాలు అందిస్తామని పచ్చిగా నిస్సిగ్గుగా మోసం చేయడం కూడా నేరమే..
ఇలాంటి వెంచర్లు ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్నాయి, భారీ మోసాలు వెలుగులోకి వస్తున్నా ప్రభుత్వం గానీ, సంబంధిత అధికారులు గానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం.. ఇంకెంతమంది అమాయకులు బలైపోతే వీళ్ళు స్పందిస్తారో అర్ధంకాని పరిస్థితి నెలకొంది..
శ్రీ సంపద డెవలపర్స్ పేరిట రమేష్ రసాల చేసిన, చేస్తున్న మోసాలపై, ఇతగాడి చేతుల్లో మోసపోయిన అమాయకుల గురించి, నిబంధనలను తుంగలో తొక్కుతున్న అవినీతిపై మరో కథనం ద్వారా ఆధారాలతో వెలుగులోకి తీసుకుని రానుంది ఆదాబ్ హైదరాబాద్ మా అక్షరం అవినీతిపై అస్త్రం..
