- ఓ యు లో ఆల్ ఇండియా ఓబిసి స్టూడెంట్స్ అసోసియేషన్ కాగడాల ర్యాలి
(యూజీసి) ఇటీవల ప్రకటించిన నూతన ఈక్విటీ నిబంధనలను దేశంలోని అన్ని విద్యాసంస్థల్లో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ఓ.బి.సి స్టూడెంట్స్ అసోసియేషన్ (AIOBCSA) ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో భారీగా కాగడాల ర్యాలి నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షుడు కిరణ్ కుమార్,టీపీసీసీ ఓబిసి సెల్ కన్వీనర్ కేతూరి వెంకటేష్,ఓబిసి ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు ఆల్ల రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
జాతీయ అధ్యక్షుడు కిరణ్ కుమార్ మాట్లాడుతూ,నూతన ఈక్విటీ నిబంధనలపై సుప్రీం కోర్ట్ విధించిన స్టేను ఎత్తివేసేలా యూజీసీ మరియు కేంద్ర ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించాలని డిమాండ్ చేశారు.ఉన్నత విద్యాసంస్థల్లో బీసీ,ఎస్సీ,ఎస్టీ విద్యార్థులపై జరుగుతున్న కుల వివక్షను అడ్డుకోవడానికి తీసుకొచ్చిన ఈ నిబంధనలను నిలిపివేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.అత్యున్నత న్యాయస్థానం గౌరవాన్ని కాపాడే విధంగా స్టేను వెంటనే ఎత్తివేయాలని కోరారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల మధు యాదవ్ మాట్లాడుతూ,మండల్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఓబిసిలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్న సమయంలో అగ్రవర్ణాలు అల్లర్లు సృష్టించినట్లే,ఇప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగా కోర్టులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.ఓబిసిలకు ఉన్నత విద్యాసంస్థల్లో రక్షణ కల్పించాలని ఎఐఓబిసిఎస్ఎ దశాబ్ద కాలంగా డిమాండ్ చేస్తోందని,దానికి అనుగుణంగానే యూజీసి నూతన నిబంధనల్లో ఓబిసిలను చేర్చారని తెలిపారు.
ఓయూ అధ్యక్షుడు అరవింద్ మాట్లాడుతూ,అనేక మంది విద్యార్థులు కుల వివక్ష కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పటికీ,అగ్రవర్ణాల ఆధిపత్య ధోరణి కొనసాగుతోందని అన్నారు.ఈక్విటీ కమిటీలను వెంటనే ఏర్పాటు చేసి యూజీసి నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ర్యాలీలో నేషనల్ సెక్రటరీ లక్ష్మీనారాయణ,వైస్ ప్రెసిడెంట్ గణేష్ గౌడ్,ప్రశాంత్,ఓయూ వైస్ ప్రెసిడెంట్ సారిక ముదిరాజ్,జనరల్ సెక్రటరీ సూర్య, సెక్రటరీ విజయలక్ష్మీ, జాయింట్ సెక్రటరీ శివ యాదవ్,హంసనామా సైదులు,జార్జ్ రెడ్డి పిడిఎస్‌యూ అధ్యక్షుడు డా.నాగేశ్వర్ రావు,టిడిఎస్‌ఎఫ్ నాయకుడు విజయ్ నాయకక్, విద్యార్థి నాయకులు అశ్విన్,వికాస్ యాదవ్,ఓఆర్‌ఎస్‌యూ మహేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
