- ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన 2వ తెలుగు లిటరరీ కాంగ్రెస్ జాతీయ మహాసభ జరిగింది.ముఖ్య అతిథిగా హాజరైన కవి,రచయిత,ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ సాహిత్యం లేకపోతే సమాజ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని అన్నారు.సమాజ విచ్ఛిన్నానికి కారణాలను సాహిత్యకారులు అన్వేషించాల్సిన అవసరం ఉందని,విశ్వజనీన అంశాలపై పరిశోధకులు దృష్టి పెట్టాలని సూచించారు.
తెలంగాణ ఉద్యమానికి సాహిత్యం ఇచ్చిన ప్రేరణను గుర్తు చేశారు.వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మొలుగారం కుమార్ మాట్లాడుతూ తెలుగు కేవలం భాష మాత్రమే కాక సంస్కృతి,జీవన శైలి అని అన్నారు.ఏఐ,నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి సాంకేతికతల ద్వారా తెలుగు అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని తెలిపారు.తెలుగు లిటరరీ కాంగ్రెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ చింతకింది కాశీం మాట్లాడుతూ సైన్స్ కాంగ్రెస్ తరహాలో తెలుగు సాహిత్యానికి కూడా ఈ వేదికను ఏర్పాటు చేశామని తెలిపారు.
తెలుగు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ వెల్దండ నిత్యానంద రావు సమాజంలో పెరుగుతున్న తరాల మధ్య అంతరాలను ప్రస్తావించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల తెలుగు అధ్యాపకులు,పరిశోధకులు,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
