ఏదులాపురంలో మునిసిపాలిటీ(Municipality)లో కాంగ్రెస్ పార్టీ(Congress Party) కార్యకర్తలు, అభిమానుల ఉత్సాహం చూస్తుంటే తప్పకుండా 32 వార్డులకు 32 కైవసం చేసుకుంటుందన్న నమ్మకం, పూర్తి విశ్వాసం తనకు ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. శనివారం ఏదులాపురం మునిసిపాలిటీ పరిధిలోని 3, 4, 5, 6, 25 వార్డుల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అభ్యర్ధులతో కలిసి వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం(Election campaign) నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
‘ఇప్పటికే వందల కోట్ల నిధులతో మునిసిపాలిటీలో కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. గత రెండేళ్లలో కేవలం ఈ వార్డుల్లోనే అభివృద్ది కోసం రూ.19 కోట్ల 74 లక్షల ఖర్చు చేశాం. రూ.680 కోట్లతో చేపట్టిన మున్నేరు రక్షణ గోడ పనులు యుద్ధ ప్రాతిపదికన వచ్చే వర్షాకాలం నాటికి పూర్తిచేయడంతోపాటు మున్నేరు పక్కన 3 ఘాట్ల ఏర్పాటు, ఎఫ్.సి.ఐ. గోడౌన్ తరలింపుతోపాటు అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చెపిస్తాం. సీఎం రేవంత్ నాయకత్వంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తూ ప్రజాప్రభుత్వం ప్రగతిపథంలో ముందుకు నడుస్తోంది. ఎన్నికలు రాగానే ప్రత్యర్థులు ప్రజల ముందుకొచ్చి సొల్లు కబుర్లు చెబుతారు.
మాయమాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. వాటిని నమ్మొద్దు. పదేళ్లు అధికారంలో ఉండి పేదవాడికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వనివారు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారో చెప్పాలి. 3వ వార్డులో వెలుగు సైదమ్మ, 4వ వార్డులో బోయిన కుమారి, 5వ వార్డులో భానోత్ నాగేంద్ర ప్రసాద్, 6వ వార్డులో వేమిరెడ్డి శివాదేవి, 25వ వార్డులో కడవ నవీన్ కుమార్ హస్తం గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలి. పేదల కష్టం తెలిసిన మీ ఇంటి పెద్ద కొడుకుగా నిత్యం అందుబాటులో ఉంటానని మునిసిపాలిటీ ప్రజలకు హామీ ఇస్తున్నాను’ అని చెప్పారు.
