Friday, February 27, 2026
Homeసాహిత్యంJuvvadi Gautama Rao | సాహితీ వటవృక్షం.. జువ్వాడి గౌతమరావు..

Juvvadi Gautama Rao | సాహితీ వటవృక్షం.. జువ్వాడి గౌతమరావు..

జువ్వాడి గౌతమరావు.. సాహితీ వటవృక్షం(Literary tree). కవి మాత్రమే కాదు(Not only the poet). సాహితీవేత్తలకు ఆశ్రయ దాత. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు, కాళోజీ నారాయణరావు, కోవెల సుప్రసన్న, సంపత్ కుమార ఆచార్య, సామల సదాశివ లాంటి సాహితీ దురంధరులతో సాన్నిహిత్యం కలిగినవారు. ప్రధానంగా కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణతో ఆయనకు గల అనుబంధం ఆసక్తికరం. విశ్వనాథను కరీంనగర్ రప్పించి, అక్కడి డిగ్రీ కళాశాల ప్రాచార్యుడిగా విధులు నిర్వహించేలా చేశారు. తద్వారా ఉత్తర తెలంగాణ సాహితీవేత్తల సంగమానికి వేదికను ఏర్పరచి, సాహిత్య సుసంపన్నానికి కార్యక్షేత్రాన్ని సిద్దం చేశారు. ఇలా.. కరీంనగర్‌లో సాహితీ సౌరభాలు గుబాళించడానికి అహరహం శ్రమించిన సాహితీప్రియుడు జువ్వాడి గౌతమరావు. స్వాతంత్య్ర పోరాట యోధుడు(Freedom fighter) కూడా. సోషలిస్టు భావాలను జీర్ణించుకున్న వ్యక్తి. ఔరంగాబాద్ జైలు గోడలను ఛేదించుకొని వచ్చిన ధైర్యశాలి. పార్టీ పక్షాన 1977లో పోటీ చేసి ఓడిపోయారు.

జువ్వాడి గౌతమరావు 1929 ఫిబ్రవరి 1న కరీంనగర్ మండలం ఇరుకుళ్ల గ్రామంలో జన్మించారు. కరీంనగర్‌లో విద్యాభ్యాసం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ, ఎల్ఎల్‌బీ పట్టా పుచ్చుకున్నారు. పీవీ నరసింహారావు, కోవెల సుప్రసన్నాచార్య, కోవెల సంపత్కుమారాచార్య వంటి సాహితీ మిత్రులతో ఆయనకు చాలా సాన్నిహిత్యం ఉంది. కరీంనగర్.. సాహిత్య చైతన్య కేంద్రంగా భాసిల్లడంలో గౌతమరావు పాత్ర అసామాన్యం, అద్వితీయం. కరీంనగర్‌లో తెనుగు ఉనికిని కాపాడుతూ అనేక కవితా గోష్ఠుల్లో పాల్గొంటూ నిరంతర సాహిత్య సేవ చేసిన భాషాభిమాని జువ్వాడి. ఆధునిక కాలంలో అడుగంటిపోతున్న సంప్రదాయ కవితా పరిరక్షణ కోసం పాటుపడ్డారు. వరంగల్‌లో కాళోజీ, ఆదిలాబాదులో సామల సదాశివ మాదిరిగా కరీంనగర్‌లో జువ్వాడి గౌతంరావు సాహితీ వటవృక్షంగా వేలాది మంది సాహితీకారులకు ఆశ్రయమిచ్చారు. ప్రగతి గామిగా ఉంటూనే విశ్వనాథ రామాయణ కల్పవృక్షానికి, విశ్వనాథకు భక్తుడిగా మారాడు. ప్రేమతో విశ్వనాథుణ్ని తన హృదయంలో దాచుకున్నారు.

- Advertisement -

కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణకు జువ్వాడి అత్యంత ఆత్మీయుడు. విశ్వనాథ రచించిన రామాయణ కల్పవృక్షాన్ని శ్రావ్యమైన కంఠంతో తనదైన శైలిలో అంతరార్థాలను విశదీకరిస్తూ రసికులకు వినిపించగలిగి, ఆయన మూర్తి తత్వాన్ని ఆవిష్కరించారు. తానే రచించాడా అన్నంతగా ప్రజల్లోకి రామాయణ కల్పవృక్షాన్ని తీసుకెళ్లారు. జువ్వాడి ప్రోద్బలంతోనే విశ్వనాథ సత్యనారాయణ కరీంనగర్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. విశ్వనాథ.. భక్తియోగ అనే పద్య కావ్య సంపుటిని జువ్వాడి కోసం రాసి అంకితం చేశారు. కల్పవృక్షంలో కైకేయి, వేయి పడగల్లో విశ్వనాథ జీవితం వంటి జువ్వాడి సాహిత్య వ్యాసాలు సాహిత్య లోకంలో సంచలనాలను సృష్టించాయి.

నవ్య సాహిత్యోద్యమ కాలంలో కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కొంతకాలం పాటు జయంతి అనే సాహిత్య పత్రిక నడిపారు. తర్వాత.. దానికి జువ్వాడి సారథ్యం వహించారు. వివిధ పత్రికల్లో జువ్వాడి రాసిన వ్యాసాలన్నింటినీ సంకలనం చేసి తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ వెలిచాల కొండలరావు.. సాహిత్య ధార పేరుతో ఒక పుస్తకాన్ని ముద్రించారు. జువ్వాడి సాహిత్య కృషికి గానీ సంపాదకత్వం వహించినప్పటి జయంతి పత్రికకు గానీ రావాల్సినంత కీర్తిప్రతిష్ఠలు రాలేదు. అయినా.. జయంతి సంపాదకుడిగా ఆయన సంపాదకత్వం పత్రికా రంగానికే వన్నె తెచ్చింది. నాడు ఇంటర్ చివరి సంవత్సరం చదువుతున్న సి.నారాయణరెడ్డి తొలి కవిత అచ్చయింది ఆ పత్రికలోనే. జీవితమంతా సాహితీ అధ్యయనంతో, విశ్వనాథ కల్పవృక్ష గానంతో గడిపారు. ఇటీవలే విశ్వనాథ ప్రత్యేక సంచికను సాహిత్య పీఠం ఆయనకు అంకితం చేసింది. జువ్వాడి 2012లో చనిపోయారు.

(ఫిబ్రవరి 1న జువ్వాడి గౌతమరావు జయంతి సందర్భంగా)

  • రామకిష్టయ్య సంగనభట్ల
- Advertisement -
RELATED ARTICLES

Latest News