Tuesday, February 10, 2026
Homeకరీంనగర్Mla Kaushik Reddy | ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు

Mla Kaushik Reddy | ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు

వీణవంక మినీ మేడారం జాతరలో ఉద్రిక్తతలు.. పోలీసులతో ఘర్షణ..

కరీంనగర్ బ్యూరో, జనవరి 30(ఆదాబ్ హైదరాబాద్): కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో నిర్వహిస్తున్న సమ్మక్క సారక్క(మినీ మేడారం) జాతర సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే(Huzurabad MLA) పాడి కౌశిక్ రెడ్డి గురువారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి భారీ కాన్వాయ్‌తో ఈ వేడుకకు బయలుదేరారు. మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకొని హైకోర్టు ఆదేశాల మేరకు మినీ మేడారం జాతరకు పరిమిత వాహనాలకే అనుమతి ఉందని చెప్పారు. దీంతో కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు నుంచి దిగిన ఆయన.. కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు.

- Advertisement -

తమను అడ్డుకోవద్దని, వెళ్లనివ్వాలని పోలీసులను పట్టుపట్టారు. ఈ క్రమంలో అక్కడ డ్యూటీలో ఉన్న కరీంనగర్ పోలీస్ కమిషనర్‌పై మతపరమైన వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. తనను అడ్డుకుంటే ‘మీ సంగతి చెబుతా’ అంటూ పోలీసులను బెదిరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరికి పోలీసులు 4 వాహనాలకు మాత్రమే అనుమతివ్వడంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. కుటుంబ సభ్యులతో కలిసి వీణవంకకు చేరుకున్నారు.

జాతర ప్రాంగణంలో మరో వివాదం

వీణవంక మినీ మేడారం జాతరలో దళిత మహిళా సర్పంచ్‌తో కొబ్బరికాయ కొట్టించాలంటూ ఎమ్మెల్యే పట్టుబట్టారు. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు వారించినా వినకపోవడంతో మరోసారి హంగామా నెలకొంది. ‘రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే’ అంటూ వ్యాఖ్యలు చేస్తూ కాసేపు ఉద్రిక్తత సృష్టించారు. ఈ క్రమంలో పోలీసులు ఆయన్ని సమ్మక్క సారక్క గద్దెల ప్రాంగణం నుంచి బలవంతంగా బయటకు తీసుకెళ్లారు.

వీణవంక మినీ మేడారం జాతర ట్రస్టీ ఉదయానందరెడ్డి వర్గానికి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వర్గానికి మధ్య ఇప్పటికే విభేదాలున్న నేపథ్యంలో గొడవ జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు.. మొక్కులు చెల్లించుకొని వెళ్లిపోవాలని ఎమ్మెల్యేకి సూచించారు. కానీ.. కౌశిక్ రెడ్డి తన మాట ప్రకారమే జరగాలని పట్టుబట్టడంతో చివరికి పోలీసులు ఆయనను కుటుంబ సభ్యులతోపాటు వాహనాల్లో అక్కడి నుంచి పంపించారు.

కేసు నమోదు

ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ నగర పోలీస్ కమిషనర్‌‌ను మతం పేరుతో దూషించిన ఘటనకు సంబంధించి BNS సెక్షన్లు 126(2), 132, 196, 299తోపాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. వీణవంక మినీ మేడారం జాతర దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే నిరసన చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కూడా జాతరల్లో పాల్గొనకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కేసులో ఇరుక్కోవడం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News