ఎన్సీపీ నేత అజిత్ పవార్(Ajit Pawar) విమాన ప్రమాదం(Plane Crash)లో చనిపోవటంపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరపాలన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(West Bengal CM Mamata Banerjee) డిమాండ్‌కు ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే(mallikarjun kharge).. మమతా బెనర్జీకి సపోర్ట్ చేశారు. కూటమిని వదిలేసి శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ(ఎస్పీ) పార్టీలోకి అజిత్ పవార్ మళ్లీ రావటానికి అజిత్ పవార్ ఆలోచిస్తున్నారంటూ ఇటీవల వచ్చిన వార్తల వల్లే ఈ ప్రమాదానికి కుట్ర జరిగి ఉంటుందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సైతం ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్ కూడా సామాజిక మాధ్యమం వేదికగా ఈ డిమాండ్ చేశారు. గతంలో జరిగిన విమాన ప్రమాదాలను బట్టి చూస్తే మమతా బెనర్జీ డిమాండ్‌లో న్యాయం ఉందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించడంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని శివసేన(యూబీటీ) ఎంపీ అనిల్ దేశాయ్ అన్నారు. విమాన ప్రమాదంపై కూలంకషంగా విచారణ చేయాలని బీజేడీ ఉపాధ్యక్షుడు దేవిప్రసాద్ మిశ్రా డిమాండ్ చేశారు.
