- క్షతగాత్రులను స్వయంగా అంబులెన్సులో ఎక్కించిన అదనపు ఎస్పీ మహేందర్
- విధి మించి మానవత్వం చాటిన వైనం
- గన్ మన్ ప్రశాంత్, డ్రైవర్ గోవర్ధన్ సేవలు భేష్
మెదక్ నియోజకవర్గ పరిధిలోని అక్కన్నపేట గ్రామ శివారులోని అక్కన్నపేట ఫారెస్ట్ పార్క్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్వాపూర్ గ్రామం నుంచి పాతూర్ సంతకు వెళ్తున్న ఆటో అదుపు తప్పి ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఢీకొన్న తీవ్రతకు ఆటో పూర్తిగా ధ్వంసమై, అందులో ప్రయాణిస్తున్న ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అదే వాహనంలో ఉన్న మరికొందరు తీవ్రంగా గాయపడగా, ప్రమాదంతో రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది.

ఇదే సమయంలో రామాయంపేట వైపు వెళుతున్న మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ప్రమాదాన్ని గమనించి వెంటనే వాహనం ఆపి ప్రమాద స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అదనపు ఎస్పీ మహేందర్ తన గన్‌మన్ ప్రశాంత్, డ్రైవర్ గోవర్ధన్, కాట్రియాల్ గ్రామ సర్పంచ్ సహాయంతో గాయపడిన వారిని స్వయంగా అంబులెన్సులో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు.
అంతటితో ఆగకుండా, రోడ్డంతా శుభ్రపరిచి, ట్రాఫిక్ నియంత్రణ చేపట్టి వాహనాల రాకపోకలను సజావుగా కొనసాగించారు. అదనపు ఎస్పీ మహేందర్, సిబ్బంది చూపిన మానవత్వం, సేవాభావం అక్కడున్న ప్రజలను తీవ్రంగా ఆకట్టుకుంది. విధి నిర్వహణకే పరిమితం కాకుండా ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలవడం పోలీస్ శాఖ సేవా దృక్పథానికి నిదర్శనంగా నిలిచిందని స్థానికులు కొనియాడారు.
