టీ20 వరల్డ్ కప్(T20 World Cup) నుంచి ఇప్పటికే బంగ్లాదేశ్(Bangladesh) ఔట్ కాగా ఇప్పుడు పాకిస్థాన్ కూడా డౌట్‌లో పడింది. ఆ దేశం పాల్గొంటుందా లేదా అనేది శుక్రవారం గానీ వచ్చే సోమవారం గానీ తేలనుంది. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్ తమ జట్టును ప్రకటించింది. కానీ.. ఆ టీమ్‌ను ఇండియాకి పంపిస్తారా లేదా అనేది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఇదే అంశంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్(Pakistan Cricket Board Chairman) మొహ్సిన్ నఖ్వీ(Mohsin Naqvi) ఇవాళ ప్రధాని(Prime Minister) షెహ్‌బాజ్ షరీఫ్(Shehbaz Sharif)తో భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సామాజిక మాధ్యమం వేదికగా ఒక ప్రకటన చేశారు. ఐసీసీ వ్యవహరించిన విధానంపై ప్రధానికి వివరించామని తెలిపారు.
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఒక నిర్ణయానికి రావాలంటూ ఆయన ఆదేశించారని వెల్లడించారు. భద్రతా కారణాల రీత్యా ఇండియాలో మ్యాచ్‌లు ఆడలేమని, వాటిని శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ కోరగా ఐసీసీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో బంగ్లాదేశ్.. టోర్నీకి దూరమైంది. కానీ.. ఈ విషయంలో పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌కి మద్దతుగా నిలిచింది. గతంలో మ్యాచ్‌ల వేదికలను మార్చారని, ఇప్పుడెందుకు మార్చట్లేదని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సైతం ఈ టోర్నమెంట్‌కి డుమ్మా కొడుతుందేమో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
