- హెల్మెట్ ధరించి ప్రమాదాల నుండి రక్షణ పొందండి.
- వనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం కృష్ణ..
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించి.. రోడ్డు ప్రమాదాలను నివారించాలని వనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం కృష్ణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం డిజిపి ఆదేశాల మేరకు వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్ లో జాతీయ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా విలేకరులతో “ఆరైవ్ ఆలైవ్”అవగాహన కార్యక్రమాన్ని టౌన్ ఎస్ఐ హరి ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ ఎం కృష్ణ మాట్లాడుతూ.. జనవరి 13 నుండి జనవరి 27 వరకు జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు రోజువారీగా పది రోజులపాటు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, వంటి రంగాల వారికి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలని లేనియెడల రోడ్డు భద్రత నియమాలు సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. వనపర్తి పట్టణంలో ఏడు రోజుల వరకు వాహనదారులకు హెల్మెట్ ధరించడం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని .. ఏడు రోజుల అనంతరం హెల్మెట్, వాహన పత్రాలు లేకుండా రోడ్లపైకి వస్తే కేసులతో పాటు పెనాల్టీలను కచ్చితంగా వేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై పి వృషికేష్, ట్రాఫిక్ ఎస్ఐ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
