- జవహర్ నగర్ ఖద్దరు వెనుక కబ్జాల బుమ్ కోటయ్య నీ మాటే శాసనమ?
- ప్రభుత్వ భూమి స్వాహా – సర్వే నెంబర్ 648
గ్రేటర్ జిహెచ్ఎంసి పరిధిలోని జవహర్ నగర్ చెన్నాపురం ప్రాంతంలో ప్రభుత్వ భూముల కబ్జాలు ఆందోళనకర స్థాయికి చేరాయి. సర్వే నెంబర్ 648లో నర్సరీ కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని అక్రమార్కులు బహిరంగంగా విక్రయిస్తూ ప్లాట్లుగా మార్చి, పేపర్ పై లేఔట్ రూపొందిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ అవసరాల కోసం కేటాయించిన విలువైన భూమిని ప్రైవేట్ వ్యక్తులుగా చూపిస్తూ అక్రమ రిజిస్ట్రేషన్లు, నకిలీ డాక్యుమెంట్లతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న వైనం బయటపడుతోంది. ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే లేఔట్లు ప్రచారం చేయడం, స్థలాలు అమ్మడం జరుగుతుండటంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతోంది.
ఖద్దరు వెనుక అండదండలు ఉండటంతో అక్రమార్కులు అధికారుల్ని లెక్కచేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కోటయ్య నీ మాటే శాసనమ అన్నట్టుగా పరిస్థితి మారిందని, కబ్జాలపై ఫిర్యాదులు ఉన్నా చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రభుత్వ భూములపై ప్రత్యేక దృష్టి సారించి, సర్వే నెంబర్ 648కు సంబంధించిన భూమిపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ లేఔట్లు తక్షణమే రద్దు చేసి, భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అధికారులదేనని, ఇకనైనా స్పందించాలని జవహర్ నగర్ ప్రజలు స్పష్టం చేస్తున్నారు.
