- నిషేధిత చైనా మాంజాపై కఠిన చర్యలు తీసుకోవాలి
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తున్న దుకాణాలపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సామాజిక సేవకులు రుద్రవెల్లి బబ్లు చారి డిమాండ్ చేశారు. మంగళవారం ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధితో మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినం పేరుతో కొందరు తమ ఆనందాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చైనా మాంజా వాడకం పర్యావరణానికి తీవ్ర హానిని కలిగిస్తోందని, ముఖ్యంగా పక్షులకు ప్రాణాంతకంగా మారుతోందని తెలిపారు. గతంలో ఈ నిషేధిత చైనా మాంజా కారణంగా అనేక మంది వాహనదారులు తీవ్ర గాయాల పాలై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. రోడ్లపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఈ మాంజా కారణంగా తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చైనా మాంజా విక్రయంపై నిషేధం విధిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, కొందరు దుకాణదారులు కేవలం లాభాల కోసమే ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అక్రమంగా విక్రయాలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఇటువంటి దుకాణాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కేసులు నమోదు చేసి వ్యాపార లైసెన్సులను రద్దు చేయాలని అధికారులను కోరారు.
పండుగ వాతావరణం పేరుతో ప్రమాదకరమైన అలవాట్లను ప్రోత్సహించకూడదని, ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రత్యేకంగా పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి తమ పిల్లలు ఎలాంటి మాంజాతో పతంగులు ఎగురవేస్తున్నారో నిరంతరం గమనించాలని సూచించారు. ప్రమాదకరమైన చైనా మాంజా వాడకం వల్ల చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద విషాదానికి దారి తీస్తుందని హెచ్చరించారు.
ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో అధికారులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిషేధిత చైనా మాంజాను పూర్తిగా నిర్మూలించాలని ఆయన డిమాండ్ చేశారు.
