- జనవరి 20న భారీ ప్రదర్శనకు జవహర్ నగర్‌లో పిలుపు
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారుల సమస్యలను పరిష్కరించేందుకు చట్టబద్ధమైన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 2026 జనవరి 20న నిర్వహించనున్న భారీ ప్రదర్శనను విజయవంతం చేయాలని జవహర్ నగర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ మేరకు జవహర్ నగర్ అంబేద్కర్–జగ్జీవన్ రామ్ ప్రాంగణంలో కరపత్రం, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం గజ్జల రామ్ చందర్ అధ్యక్షతన జరగగా, ప్రజా కళామండలి రాష్ట్ర అధ్యక్షులు జాన్, క్రాంతి కలమండలి వెంకరచారి, ప్రజా కళాకారుడు కొన్నే వేణు, గుండా యాదగిరి, గండి శ్రీను, భాస్కర్, తొండా వెంకట్, ఎర్ర యాదగిరి, పల్లె ప్రవీణ్ (డప్పు), ఏ.ప్రవీణ్, పోతరాజు సోమన్న, ఎస్.డి. జిలానీ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కళాకారులు ఆటపాటలతో ప్రజలను ఉద్యమంలోకి తీసుకువచ్చారని, గజ్జెలు కట్టుకుని గ్రామగ్రామాలూ తిరిగి ఉద్యమాన్ని ముందుకు నడిపారని వారు గుర్తుచేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమ కళాకారుల సంక్షేమానికి చట్టబద్ధ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, రెండేళ్లు గడిచినా అమలు చేయకపోవడం బాధాకరమని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమ కళాకారులను పక్కనపెట్టి సినీ పరిశ్రమకు చెందిన వారికి కోట్ల రూపాయల రాయితీలు ఇవ్వడం అన్యాయమని మండిపడ్డారు. జానపద సాహిత్యం, సంస్కృతి సంచార జాతుల నుంచే ఉద్భవించిందని, ప్రత్యేక తెలంగాణలో వారికి విద్య, ఉద్యోగ, ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు
కోలాటం, బుర్రకథలు, తోలుబొమ్మలాట, గంగిరెద్దులాట, చిందు యక్షగానం వంటి అనేక కళారూపాలు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజానికి విజ్ఞానం, వినోదం అందిస్తూ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో తెలంగాణ కళాకారుల పాత్ర అమూల్యమని కొనియాడారు.
తక్షణమే చట్టబద్ధతతో కూడిన జీవో జారీ చేయాలని, నిజమైన కళాకారులను గుర్తించి ఉద్యోగాలు, ఉచిత విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని, 250 గజాల ఇళ్ల స్థలాలు, నాలుగు గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే వృద్ధ కళాకారులకు నెలకు రూ.30 వేల పెన్షన్ ఇవ్వాలని కోరుతూ, సూర్యపేటలో జరిగే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
