- అనుమతుల్లేకుండానే అట్టహాస ప్రారంభం.
- పట్టణంలో అధికారులు ఏం చేస్తున్నారు.?
- ప్రజల ప్రాణాలకు గ్యారంటీ ఎవరు.?
- మేం బిజీ అంటూ చేతులు దులుపుకున్న అధికారులు.
- భద్రతా నిబంధనలకు తూట్లు.
అనుమతుల అవేంటి… నాకేం తెలియదు అనే నిర్వాహకుడి వింత సమాధానం. పట్టణంలో అధికారులు ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నలు నిన్న, ఇవాళ సగటు మనిషిని తీవ్రంగా కలిచివేస్తుంది. స్థానిక అయ్యప్ప స్వామి గుడిని ఆనుకుని గత 20 రోజులుగా కొనసాగుతున్న ఎగ్జిబిషన్ పనులపై ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా ప్రశ్నించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఎవరి అనుమతితో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారో తెలియదు. ఎటువంటి అధికారిక అనుమతులు లేకపోయినా ఊరూరా ప్రచారం చేస్తూ, చాటింపు అట్టహాసంగా నాయకుల సమక్షంలో ప్రారంభోత్సవాలు నిర్వహించారు. తీరా విచారిస్తే అధికారుల నుంచి కనీస అనుమతి కూడా పొందలేదన్న విషయం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.

నిబంధనల ప్రకారం ఎలా ఉండాలి.? :
పట్టణంలో లేదా నగర పరిధిలో ఎగ్జిబిషన్ లేదా ప్రదర్శన ఏర్పాటు చేయాలంటే ముందుగా స్థల యాజమాన్య అనుమతులు, చుట్టుపక్కల నివసించే ప్రజల అభిప్రాయాలు సేకరించాలి. అనంతరం మున్సిపాలిటీ అనుమతి, ఫైర్ సేఫ్టీ అధికారుల నుంచి ఎన్‌ఓసీ, రహదారి భద్రత అనుమతులు, విద్యుత్, రెవెన్యూ శాఖల నుంచి అవసరమైన పర్మిషన్లు తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. కానీ అయ్యప్ప స్వామి గుడి సమీపంలో ఏర్పాటైన ఈ ఎగ్జిబిషన్‌కు అలాంటి అనుమతులేవీ లేవని అధికారికంగా స్పష్టమవుతోంది. అయినప్పటికీ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి, సాక్షాత్తు ప్రభుత్వంలో ఉన్న పెద్దల చేత ప్రారంభోత్సవం చేయించడాన్ని చూసి నిర్వాహకుడి ధైర్యాన్ని మెచ్చుకోక తప్పదు..
మేం బిజీ.. అధికారుల సమాధానం :
ఈ వ్యవహారంపై పట్టణ అధికారులను సంప్రదించి వివరణ కోరగా, మేం ఎన్నికల హడావుడిలో ఉన్నాం అంటూ వింత సమాధానం ఇస్తున్నారు. ప్రజల ప్రాణాల విషయం ఏమిటి? అని ప్రశ్నించగా. “ఇప్పటికిపుడు ఏం జరుగుతుంది” అనే నిర్లక్ష్యపు జవాబు ఇవ్వడం అధికారుల వైఖరిని ప్రశ్నార్థకంగా మార్చింది.అసలే అయ్యప్ప స్వామి గుడి వద్ద నిత్యం భక్తుల రాకపోకలు కొనసాగుతుంటాయి. పక్కనే జాతీయ రహదారి ఉండగా, భారీ నిర్మాణాలు, ఎగ్జిబిషన్ పనులు జరుగుతుండటం ప్రమాదకరంగా మారిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే బాధ్యత ఎవరిది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఎంట్రీ ఫీజుల దోపిడీ ?
మూడు సంవత్సరాల లోపు పిల్లలకు మినహాయింపు ఉన్నప్పటికీ, మూడు సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరి నుంచి రూ.50 ఎంట్రీ ఫీజు వసూలు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండానే ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం దోపిడీకి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.చట్టబద్ధమైన అనుమతులు లేకుండానే ఎగ్జిబిషన్ కొనసాగుతుండటం, అదే సమయంలో అధికారుల నిర్లక్ష్యం అనుమానాలకు తావిస్తోంది.
ప్రజల ప్రాణాలకు దిక్కెవరు?
ఎవరో చేస్తున్న తప్పుల వల్ల ఎందరో ప్రాణాలు బలైన సంఘటనలు గతంలో మన కళ్లముందే జరిగాయి. అయినప్పటికీ అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదని, “నా దాకా వచ్చిన తర్వాత చూస్తా” అన్న ధోరణితో వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదోడి ప్రాణాలకు దిక్కెవరు? అన్న ప్రశ్నలు ప్రమాదం జరిగితే తప్ప అధికారులు స్పందించరా.?అనుమతుల్లేని ఎగ్జిబిషన్‌పై వెంటనే చర్యలు తీసుకుని, ప్రజల భద్రతకు భరోసా కల్పించాలని, నిబంధనలను అతిక్రమించిన నిర్వాహకులు మరియు నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
