Friday, February 27, 2026
Homeఆదిలాబాద్Inspection | మాతా-శిశు సంరక్షణపై ఆకస్మిక తనిఖీలు

Inspection | మాతా-శిశు సంరక్షణపై ఆకస్మిక తనిఖీలు

  • సాధారణ ప్రసవాలపై ప్రత్యేక దృష్టి

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ (మాతా–శిశు సంరక్షణ) డాక్టర్ సుధీర్, జాతీయ ఆరోగ్య మిషన్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ డాక్టర్ పద్మజల ఆధ్వర్యంలోని రాష్ట్రస్థాయి వైద్య బృందం శనివారం మంచిర్యాల జిల్లాలో మాతా–శిశు సంరక్షణ కార్యక్రమాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి, కాసిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, యాపాల ఉపకేంద్రం, అలాగే మాతా–శిశు సంరక్షణ కేంద్రం లను సందర్శించి, గర్భవతుల నమోదు, వారికి అందుతున్న వైద్య సేవలు, శిశు సంరక్షణ కార్యక్రమాల అమలుపై సమగ్రంగా సమీక్షించారు. ఆసుపత్రుల్లో నమోదైన గర్భవతుల వివరాలు, సాధారణ ప్రసవాలు–సిజేరియన్ ప్రసవాలపై ఆడిట్, సి-సెక్షన్ ఆడిట్ పత్రాలను నర్సింగ్ అధికారుల ద్వారా వెరిఫికేషన్ చేయించారు. ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేసిన కేసుల వివరాలు, రిఫరల్‌కు గల కారణాలపై స్పష్టమైన జస్టిఫికేషన్ ఇవ్వాలని అధికారులకు సూచించారు.

సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యం ఇవ్వాలి

సాధారణ ప్రసవాలే ముద్దు, సిజేరియన్లు వద్దు అనే నినాదంతో ముందుకు వెళ్లాలని వైద్య సిబ్బందికి సూచించారు. మాతృ మరణాలు, శిశు మరణాలు తగ్గించే లక్ష్యంతో అన్ని స్పెషాలిటీ వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

- Advertisement -

హెల్ప్ డెస్క్, అంబులెన్స్ సేవల సమీక్ష

హెల్ప్ డెస్క్ సిబ్బంది ఈ నెలలో ఉన్న గర్భవతుల వివరాలను ముందుగానే ఫోన్ ద్వారా తెలుసుకుని, తగిన సూచనలు, ఆరోగ్య సేవలు అందించాలని తెలిపారు. 108, 102 అంబులెన్స్ సేవల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అలాగే గర్భవతులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాల అమలును పరిశీలించారు. వైద్య సేవల అందజేతలో ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎస్. అనిత, డాక్టర్ వేదవ్యాస్, డాక్టర్ భీష్మ, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ అరుణ శ్రీ, డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ రవి, డాక్టర్ దివ్య, వైద్యులు, నర్సింగ్ అధికారులు, 108 కోఆర్డినేటర్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, డిపిఓ ప్రశాంతి, సిహెచ్ఓలు వెంకటేశ్వర్లు, నాందేవ్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మాతా–శిశు సంరక్షణలో అందుతున్న వైద్య సేవల పూర్తి వివరాలను వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్కి, జిల్లా కలెక్టర్ కి నివేదిక రూపంలో సమర్పిస్తామని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News