- అధికారులతో సమన్వయం చేసుకుంటూ పథకాల అమలును వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా(Nirmal Collector) ఆదేశించారు. విద్య, ఉపాధి హామీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, తాగునీటి సరఫరా, చేయూత పింఛన్ల పరిశీలన తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలో ప్రభుత్వ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు.
శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్‌తో కలిసి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగం, నిర్దేశిత లక్ష్యాల పురోగతిపై ప్రధాన కార్యదర్శి సమీక్షించారు.

సమగ్ర శిక్ష అభియాన్, పీఎం శ్రీ పథకాల కింద మంజూరైన నిధులను జనవరి మొదటి వారంలోగా గరిష్ట స్థాయిలో వినియోగించాలని సీఎస్ సూచించారు. పీఎం శ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ఇతర మరమ్మతు పనులను చేపట్టాలని, విద్యార్థుల హాజరు శాతం పెంచాలని సూచించారు. మధ్యాహ్న భోజనం, అల్పాహార పథకాలను నాణ్యతతో అమలు చేయాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే విద్యార్థులకు యూనిఫారాలు, కిట్లు అందేలా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
వేసవి కాలం ముగిసే వరకు ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించడమే ప్రధాన ప్రాధాన్యతగా ఉండాలని సీఎస్ స్పష్టం చేశారు. జిల్లా, మండల స్థాయిలో తాగునీటి కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి వారం సరఫరా పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. నవంబర్ 15లోగా చేతిపంపులు, బోర్లు, బహిరంగ బావులకు సంబంధించిన మరమ్మతులు పూర్తి చేయాలని, నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి తాగునీటి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు. మిషన్ భగీరథ పైపులైన్లలో లీకేజీలు, ప్రెజర్ వాల్వ్‌లను నిరంతరం పర్యవేక్షించాలని, అక్రమ కనెక్షన్లు, నీటి వృథాను అరికట్టాలని తెలిపారు.

వి బి జి రామ్ జి పథకం కింద చేపట్టే పనులను నాణ్యతతో అమలు చేస్తూ మార్చి నెలాఖరు నాటికి 12 కోట్ల పనిదినాల లక్ష్యాన్ని సాధించాలని సీఎస్ సూచించారు. గ్రామాల్లో అవసరమైన పనులను గుర్తించి కూలీలకు విస్తృతంగా ఉపాధి కల్పించాలని, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయాలని సీఎస్ ఆదేశించారు. పూర్తయిన ఇళ్లకు ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక లోగో స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక అందించేలా ‘మన ఇసుక – మన వాహనం’ యాప్‌ను సమర్థవంతంగా వినియోగించాలని, రవాణా ఖర్చులు మాత్రమే వసూలు చేయాలని తెలిపారు. అలాగే లబ్ధిదారులకు సిమెంట్ బస్తాను రూ.230కే అందించేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ రాయితీలు పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు చేరేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో ప్రతి జిల్లా మెరుగైన ఫలితాలు సాధించాలని, ముఖ్యమంత్రి డాష్‌బోర్డులో నమోదైన అంశాలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సీఎస్ సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా చేరవేసేందుకు సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించాలని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి బోజన్న, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
