- కిడ్నాప్ ఆరోపణలు, బీజేపీ నేత కారుపై దాడి.. ఉద్రిక్తత నడుమ కొలిక్కి వచ్చిన ఉపసర్పంచ్ ఎన్నిక…
నల్గొండ మండలం జి.చెన్నారం గ్రామంలో ఉపసర్పంచ్ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ-బీఆర్ఎస్ వర్గాల మధ్య పోటాపోటీ రాజకీయాలతో గ్రామం రణరంగాన్ని తలపించింది. కిడ్నాప్ ఆరోపణలు, అర్ధరాత్రి కండువాల మార్పులు, నేతల కార్ల నిలిపివేత వంటి పరిణామాలతో రోజంతా గ్రామంలో హైడ్రామా నడిచింది. చివరకు పోలీసుల జోక్యంతో ఉపసర్పంచ్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. గ్రామంలో మొత్తం ఎనిమిది వార్డులు ఉండగా, ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన చీలిక కనిపించింది. నాలుగు వార్డులను కాంగ్రెస్ ఏకగ్రీవంగా గెలుచుకోగా, మిగిలిన నాలుగు వార్డులను బీజేపీ-బీఆర్ఎస్ కూటమి దక్కించుకుంది. ఉపసర్పంచ్ పీఠాన్ని దక్కించుకోవాలంటే ఐదో వార్డు సభ్యుడి మద్దతు అనివార్యం కావడంతో ఇరుపక్షాలు శతవిధాలా ప్రయత్నించాయి. ఈ క్రమంలోనే రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

అర్ధరాత్రి కిడ్నాప్ డ్రామా?..
బీజేపీ తరఫున గెలిచిన వార్డు సభ్యురాలు ఉప్పునూతల చంద్రకళను కాంగ్రెస్ నాయకులు అర్ధరాత్రి కిడ్నాప్ చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఆమెకు బలవంతంగా కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారని స్థానిక నేతలు బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే రంగంలోకి దిగిన రామరాజు, వార్డు సభ్యులతో మాట్లాడారు. తాను ఒత్తిడి మేరకే కండువా మార్చుకోవాల్సి వచ్చిందని, తన మద్దతు బీజేపీకేనని చంద్రకళ స్పష్టం చేయడంతో సమీకరణాలు మారిపోయాయి.
రామరాజు కారుపై దాడికి యత్నం.. పోలీసుల తీరుపై విమర్శలు..
వార్డు సభ్యులతో కలిసి కారులో వెళ్తున్న పిల్లి రామరాజును కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కారు టైర్లలో గాలి తీసివేసి, దాడికి యత్నించడంతో పరిస్థితి విషమించింది. ఈ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని, అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని రామరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డీఎస్పీ శివరాం రెడ్డికి సమాచారం అందించడంతో, కనగల్ ఎస్సై ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.పోలీసుల పహారా నడుమ జరిగిన ఎన్నికలో ఉప్పునూతల చంద్రకళ ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పన్నాగాలను తిప్పికొట్టి తమ అభ్యర్థి విజయం సాధించిందని బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా పిల్లి రామరాజు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన వారిని భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమన్నారు. దౌర్జన్యానికి పాల్పడిన ఉప్పునూతల వెంకన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
