- పార్టీ మార్పు వదంతులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి క్లారిటీ
పార్టీ మారినట్లుగా వస్తున్న వార్తలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఖండించారు. తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నానని, కాంగ్రెస్ పార్టీలో చేరలేదని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపుపై స్పీకర్ ఇచ్చిన నోటీసులకు స్పందిస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చినట్లు తెలిపారు.నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. పార్టీ మారానంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పు. నేను బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదు. కాంగ్రెస్‌లో చేరుతానని ఎక్కడా చెప్పలేదు. ఈ విషయాలను స్పీకర్‌కు లిఖితపూర్వకంగా తెలియజేశాను అని కడియం శ్రీహరి పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో బుధవారం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు వెలువరించారు.
ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్‌లపై అనర్హత వేటు వేయడానికి నిరాకరించారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. సాంకేతికంగా ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోనే ఉన్నట్లు పేర్కొన్నారు.బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ అంశంపై డిసెంబర్ 18లోగా నిర్ణయాన్ని సీల్డ్ కవర్‌లో సమర్పించాలని సుప్రీంకోర్టు స్పీకర్‌ను ఆదేశించిన నేపథ్యంలో, గత నెల రోజులుగా విచారణ వేగవంతమైంది. ఇప్పటివరకు 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ పూర్తయిందని తెలుస్తోంది..
