- పండుగకు ముందు ప్రయాణం పరీక్ష కానుందా ?
- రెండు నెలల ముందే నిండిపోయిన రైల్వే రిజర్వేషన్లు
- ప్రతి ఏడాది ఇదే కథ… అయినా మారని రైల్వే పాఠం
- ఇదే అదనుగా ప్రయాణికుల నడ్డీ విరుస్తున్న ప్రయివేట్ ట్రావెల్స్
సంక్రాంతి అంటే ఆంధ్రులకు సొంతూరి పిలుపు.ఆ పిలుపే ఇప్పుడు ఖరీదైన ప్రయాణంగా మారుతోంది.పండుగకు ఇంకా నెల రోజుల సమయం ఉండగానే రైల్వే రిజర్వేషన్లు పూర్తిగా నిండిపోవడం, వెయిటింగ్ లిస్ట్ దాటి ‘రిగ్గ్రెట్’గా మారడం… ప్రయాణికుల ఆనందాన్ని ముందే మింగేస్తోంది.ప్రతి ఏడాది ఇదే పరిస్థితి ఎదురవుతున్నా, రద్దీ అంచనాల్లో రైల్వే వ్యవస్థ ఇప్పటికీ పాఠం నేర్చుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రైళ్లలో చోటు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ వైపు మొగ్గు చూపుతుండగా, అక్కడ మాత్రం పండుగ డిమాండ్ పేరుతో చార్జీల పేరిట ప్రయాణికుల నడ్డీ విరుస్తున్నాయి.సంక్రాంతి సంబరాలకు ముందే, సొంతూరి ప్రయాణమే ఆంధ్రులకి పెద్ద పరీక్షగా మారింది.
రెండు నెలల ముందే నిండిపోయిన సీట్లు
సంక్రాంతి రద్దీపై ముందస్తు అంచనాలు వేసే విషయంలో రైల్వే మరోసారి విఫలమైందా అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ప్రత్యేక రైళ్లు వేసినప్పటికీ, రెగ్యులర్ రైళ్లను నడిపినా, లక్షలాది మంది ప్రయాణికుల అవసరాలకు అవి సరిపోవడం లేదు. ముఖ్యంగా విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాల వైపు వెళ్లే రైళ్లలో ఒక్క బెర్త్ కూడా ఖాళీ లేకపోవడం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది. పండుగకు ఇంకా సమయం ఉన్నా, రిజర్వేషన్లు పూర్తిగా నిండిపోవడం ప్రయాణికుల్లో ఆందోళనను మరింత పెంచుతోంది.

ఉద్యోగులే ఎక్కువగా నష్టపోతున్నారు..
ఉద్యోగాల ఒత్తిడి, సెలవుల అనిశ్చితి కారణంగా ముందుగా రైల్వే రిజర్వేషన్ చేసుకోలేని ఉద్యోగులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. టికెట్ కౌంటర్ల దగ్గరైనా, ఆన్‌లైన్ పోర్టల్స్‌లో ప్రయత్నించినా ప్రయాణికులకు ఎదురవుతున్న సమాధానం ఒక్కటే … సీట్లు అందుబాటులో లేవు. పండుగకు సొంతూరి బాట పట్టాలనుకున్న ఉద్యోగుల ఆశలు, రిజర్వేషన్ స్క్రీన్ వద్దే ఆగిపోతున్నాయి..
ప్రయాణికులకు బస్సులే చివరి ఆశ?
విశాఖపట్నం వంటి దూర ప్రాంతాలకు రైలులో కనీసం 12 గంటల ప్రయాణం తప్పనిసరి. అదే ప్రయాణాన్ని బస్సుల్లో చేయాలంటే అనేక మార్పులు, అధిక ఖర్చు, శారీరక అలసట తప్పవు. అయినప్పటికీ రైళ్లలో చోటు లేకపోవడంతో ప్రయాణికులు ఇప్పుడు బస్సులనే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైళ్లకు ప్రత్యామ్నాయం కాకపోయినా, తప్పని సరి పరిస్థితిలో బస్సులే చివరి దారిగా మారుతున్నాయి.
ప్రతి ఏడాది ఇదే కథ… మారని రేల్వే శాఖ తీరు ..
సంక్రాంతి, దసరా, దీపావళి… ప్రతి పెద్ద పండుగకు ఇదే దృశ్యం పునరావృతమవుతోంది. డిమాండ్ తెలుసు, ప్రయాణికుల సంఖ్య తెలుసు… అయినా ముందస్తు ప్రణాళికలు మాత్రం ఎక్కడా కనిపించవు. పండుగ రద్దీ అంచనాల్లో రైల్వే శాఖ చూపిస్తున్న ఈ నిర్లక్ష్యం, ప్రతి ఏటా ప్రయాణికుల పండుగ ఆనందాన్ని ప్రయాణ బాధగా మార్చేస్తోంది. సంక్రాంతి సంతోషం కోసం సొంతూరి బాట పట్టే ఆంధ్రులకు, ఈసారి ప్రయాణమే పెద్ద సవాలుగా మారింది. రైలు టికెట్ దొరకకపోతే పండుగ ఆనందం కూడా అర్ధాంతరంగా ఆగిపోతుందనే వాస్తవం, మరోసారి రైల్వే వ్యవస్థ వైఫల్యాన్ని బట్టబయలు చేస్తోంది.
