24 ఏళ్ల కిందట 2001 సెప్టెంబర్ 6న తెలుగు తెరపై ఒక మ్యాజిక్ జరిగింది. అదే ‘నువ్వు నాకు నచ్చావ్’(Nuvvu Naaku Nachav). ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు విందు భోజనం తిన్నంత సంతృప్తి కలిగింది. ఇప్పటికే చాలా సార్లు ఈ చిత్రాన్ని వీక్షించినా కూడా ఇంకా బోర్ కొట్టనంత రిపీట్ వ్యాల్యూ ఉన్న కంటెంట్ ఇది. అందుకే 2026 కొత్త సంవత్సరాన్ని ఈ సినిమాతో చిల్ కావడానికి పూర్తి సాంకేతిక హంగులతో 4Kలో రీరిలీజ్‌కి సిద్ధమైంది. ఈ సినిమా అప్పట్లో విదేశాల్లో పూర్తి స్థాయిలో రిలీజ్ కాలేదు. ఆ లోటును తీర్చడం కోసం కూడా ఈ సినిమా జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సినిమా తీస్తున్నప్పుడే నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్(Sravanthi Ravi Kishore) ఇది ఒక గొప్ప సినిమా అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. విక్టరీ వెంకటేష్‌ని (Victory Venkatesh) కొత్త పంథాలో ఆవిష్కరించిన సినిమా ఇది. ‘నువ్వే కావాలి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ భాస్కర్-త్రివిక్రమ్ (Vijay Bhaskar-Trivikram) ఫుల్ జోష్‌తో చేసిన సినిమా ఇది. అప్పటికే త్రివిక్రమ్‌కి ‘మాటల మాంత్రికుడు’ అనే ఇమేజ్ వచ్చేసింది. ఇప్పటికీ ఈ సినిమాలోని డైలాగ్స్ మార్మోగుతూనే ఉన్నాయి. ఇక.. కోటి సంగీతం, సిరివెన్నెల-భువనచంద్రల సాహిత్యం ఎవర్ గ్రీన్. ఆర్తి అగర్వాల్ (Aarthi Agarwal) ఇప్పుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఎప్పటికీ గుర్తుండిపోతారు. ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, సునీల్, చంద్రమోహన్, ఎంఎస్ నారాయణ.. ఇలా చెప్పుకుంటూపోతే అందరివీ గుర్తుండిపోయే పాత్రలే.
నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ.. తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయి అయిన “నువ్వు నాకు నచ్చావ్” ఇప్పుడు 4Kలో తిరిగి థియేటర్లలోకి వస్తోంది. ఇది కేవలం రీ-రిలీజ్ కాదు. 2026 కొత్త సంవత్సరాన్ని కుటుంబంతో కలిసి నవ్వులు పూయిస్తూ ప్రారంభించడానికి ఇదే సరైన సమయం. 25 ఏళ్లుగా రకరకాల మాధ్యమాల్లో ఆస్వాదిస్తున్న ఈ అనుభూతిని ఇప్పుడు థియేటర్లలో సంపూర్ణంగా ఆస్వాదించండి. ఈ సినిమా షూటింగ్ 87 రోజులు జరిగింది. ప్రతి రోజూ నాకు గుర్తుంది. ఎక్కడ ఏమేం తీశామో, ఎలా తీశామో, ఒక టీమ్ వర్క్‌లాగా ఎంత ఇష్టపడి పని చేశామో అన్నీ గుర్తున్నాయి అని చెప్పారు.
