Sunday, February 22, 2026
Homeఆరోగ్యంBiomedical Waste | జీవవైద్య వ్యర్థాల సమస్యకు పరిష్కారమేది?

Biomedical Waste | జీవవైద్య వ్యర్థాల సమస్యకు పరిష్కారమేది?

ప్రపంచవ్యాప్తంగా వైద్య సేవలు, ప్రయోగశాల పరిశోధనలు, బయోటెక్నాలజీ కార్యకలాపాలు విస్తరించడంతో బయోమెడికల్ వ్యర్థాల ఉత్పత్తి రోజురోజుకు పెరుగుతోంది. శస్త్ర చికిత్స అవశేషాలు, రసాయన మిగులు, సూక్ష్మజీవ కల్చర్లు, వాడిన పరికరాలు వంటి పదార్థాలు సరిగా నిర్మూలించకపోతే గాలి, నీరు, నేలపై ప్రమాదకర ప్రభావాలు చూపుతాయి. అభివృద్ధి చెందిన దేశాలు ఆటోక్లేవ్, మైక్రోవేవ్ స్టెరిలైజేషన్, డిజిటల్ ట్రాకింగ్ వంటి పద్ధతులతో నియంత్రణ బలోపేతం చేస్తున్నప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాలు మౌలిక వనరుల కొరత, శిక్షణ లోపం, నిబంధనల అమలు, నిర్లక్ష్యం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సేవల అవసరం ప్రపంచవ్యాప్తంగా సమర్థవంతమైన వ్యర్థ నిర్వహణ వ్యవస్థల ప్రాముఖ్యతను మరింత పెంచుతోంది.

సంక్రమణకారక జీవులు కలిగిన వ్యర్థాలు అనుకోని గాయాల ద్వారా హెపటైటిస్-B, హెపటైటిస్-C, HIV వంటి ప్రమాదకర వ్యాధులను మనుషుల్లో వ్యాప్తి చేస్తాయి. రసాయనాలను, ఔషధ అవశేషాలను నదులు, చెరువులు, భూగర్భ జలాల్లో కలిపితే దీర్ఘ కాలంలో చేపలు, పక్షులు, పశువుల ఆరోగ్యం దెబ్బతింటుంది. హెవీ మెటల్స్ జీవుల శరీరాల్లో నిల్వయ్యే బయో-అక్యుములేషన్ ప్రభావం ఆహార గొలుసును కూడా అస్థిరం చేస్తుంది. పక్కదారి ద్వారా మనుషులకే తిరిగి విషపూరిత ప్రభావాలు చేరతాయి. యాంటీ బయాటిక్ అవశేషాలు సూక్ష్మజీవుల్లో ఔషధ నిరోధకతను పెంపొందించి, చికిత్సను కష్టతరం చేస్తాయి. ఈ ప్రమాదాల సమాహారం ప్రజారోగ్య భద్రతకు తీవ్ర సమస్యగా వేధిస్తోంది. బయో మెడికల్ వ్యర్ధాల నియంత్రణకు కఠిన చర్యలు అవసరమని తెలియజేస్తోంది.

- Advertisement -

శుద్ధీకరణ లేకుండా విడుదలయ్యే వ్యర్థాలు జలవనరుల రసాయన నిర్మాణాన్ని మారుస్తాయి. భారీ లోహాలు నీటిలో కరుగుతూ చేపల నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. హార్మోన్ ప్రభావిత సమస్యల పెరుగుదలతోపాటు ప్రజనన సామర్థ్యాలను కూడా తగ్గిస్తాయి. పాథోజెన్లు నీటి ద్వారా ప్రయాణించి పశువులు, పక్షులు, వన్యజీవుల్లో సంక్రమణలు కలిగిస్తాయి. మురికి డంపింగ్ ప్రదేశాల వద్ద సంచరించే జంతువులు కలుషిత పదార్థాలు తిని మరణిస్తాయి లేదా తీవ్రమైన అనారోగ్యం చెందుతున్నాయి. పర్యావరణ శృంఖలంలోని ఒక మెట్టుకు నష్టం కలిగితే మొత్తం ఎకోసిస్టం అస్థిరమవుతుంది. ఈ పరిణామాలు నీటి వనరుల సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ అసమతుల్యతకు దారితీస్తాయి.

అంతర్జాతీయంగా WHO, UNEP, World Bank వంటి సంస్థలు సురక్షిత పారిశుద్ధ్య ప్రమాణాలను సూచిస్తూ దేశాల సామర్థ్య వృద్ధికి సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నాయి. అనేక దేశాలు బర్నింగ్ తగ్గించి non-burn టెక్నాలజీల వైపు మళ్లి శాస్త్రీయ విధానాలను బలోపేతం చేస్తున్నాయి. భారతదేశం Bio-Medical Waste Management Rules-2016 ద్వారా కలర్ కోడ్ సెగ్రిగేషన్, ఆన్‌లైన్ ట్రాకింగ్, లైసెన్స్ కలిగిన ట్రీట్మెంట్ ప్లాంట్‌లకు తప్పనిసరి బదిలీ వంటి నిబంధనలను అమలుచేస్తోంది. అయినప్పటికీ వేగవంతమైన నగరాల విస్తరణ, చిన్న క్లినిక్‌ల నియంత్రణ లోపం, శిక్షణ కొరత వంటి సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల లోపం పరిస్థితిని క్లిష్టం చేస్తోంది.

ఆటోక్లేవ్, మైక్రోవేవ్ స్టెరిలైజేషన్, కెమికల్ ఇనాక్టివేషన్, డిజిటల్ ట్రాకింగ్ వంటి ఆధునిక పద్ధతులు వ్యర్థాల ప్రమాద స్థాయిని తగ్గిస్తున్నాయి. సేఫ్టీ ఇంజనీర్డ్ శార్ప్ పరికరాలు, వ్యక్తిగత రక్షణ పరికరాల వినియోగం, ఎక్స్‌పోజర్ తర్వాత చికిత్స ప్రోటోకాల్‌లు ఆరోగ్య కార్యకర్తల భద్రతను పెంచుతున్నాయి. అనేక దేశాలు వర్కర్లకు ఇన్సూరెన్స్, ప్రమాద పరిహారం పథకాలను అమలు చేస్తూ వృత్తి ప్రమాదాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. భారతదేశం కూడా పర్యవేక్షణా వ్యవస్థను బలోపేతం చేసి, పబ్లిక్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగుపరచాలి. భవిష్యత్తులో శాస్త్రీయ పద్ధతులు, నిబంధనల కఠిన అమలు, సమాజం భాగస్వామ్యం కలిసినప్పుడే ప్రపంచం, భారతదేశం బయోమెడికల్ వ్యర్థాల సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలవు.

  • గిలకత్తుల వెంకటరమణ
- Advertisement -
RELATED ARTICLES

Latest News