వ్యాధి తీవ్రత పెరగక ముందే చికిత్స అందించండి
స్క్రబ్ టైఫస్ కేసుల నమోదుపై సీఎం చంద్రబాబు సమీక్ష
స్క్రబ్ టైఫస్ అంటువ్యాధి కాదని తెలిపిన అధికారులు
స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధికారులను ఆదేశించారు. ఈ వ్యాధి కేసుల నమోదుపై వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సౌరభ్ గౌర్‌తో సచివాలయంలో సమీక్షించారు. ఇటీవల విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ బారినపడి చందక రాజేశ్వరి అనే మహిళ మృతి చెందిన ఘటనలు మరెక్కడా జరగకుండా చూడాలని సీఎం చెప్పారు. చిగ్గర మైట్ (Chigger Mite) తరహా కీటకాలు కుట్టడం వల్ల వచ్చే వ్యాధితోపాటు ప్రమాదాన్ని ఏవిధంగా కట్టడి చేయాలనేదానిపై ప్రజలకు వివరించాలని అన్నారు.
ఈ క్రమంలో చందక రాజేశ్వరి మృతికి సంబంధించిన అంశాలను సీఎంకి సౌరభ్ గౌర్ వివరించారు. రాజేశ్వరిని చిగ్గర్ మైట్ కుట్టిందని, దీంతో ముందుగా టైఫాయిడ్(Typhoid Fever) చికిత్స అందించారని, తర్వాత ర్యాపిడ్ టెస్ట్ ద్వారా స్క్రబ్ టైఫస్ పాజిటివ్ అని తేల్చారని తెలిపారు. స్క్రబ్ టైఫస్ కేసులు, ఆ వ్యాధి లక్షణాలు, వాటి వల్ల ఎలాంటి ప్రమాదం సంభవిస్తుంది అనే అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎం సూచించారు.
స్క్రబ్ టైఫస్ అంటువ్యాధి కాదు
ఓరింటియా సుసుగాముషి అనే బాక్టీరియా (Orientia Tsutsugamushi bacterium) ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఇది అంటువ్యాధి కాదు. చిగ్గర మైట్స్ కీటకాలు కుట్టడం ద్వారా వస్తుంది. అధిక జ్వరం, చలి, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులతోపాటు మైట్ కుట్టిన తర్వాత పుండ్లు ఏర్పడటం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. సకాలంలో చికిత్స అందిస్తే ఇబ్బంది ఉండదు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
ఏవైనా కీటకాలు కుట్టిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి తీవ్రత పెరగకముందే అవసరమైన చికిత్స అందించేలా వైద్యారోగ్య శాఖ సిద్దంగా ఉండాలి. ఈ ఏడాది చిత్తూరు, కాకినాడ జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. చిన్న చిన్న కీటకాలు కుడితే మృత్యువాత పడే స్థాయికి పరిస్థితి రాకూడదు. పూర్తిస్థాయిలో అవగాహన పెంచడమే దీనికి సరైన మార్గం.
