4వ జాతీయ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) స్పోర్ట్స్ మీట్ (Sports meet) 2025లో ఓవరాల్ ఛాంపియన్షిప్(Overall Championship)ను సాధించిన తెలంగాణ విద్యార్థులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఒడిశాలోని రూర్కేలాలో నవంబర్ 11 నుంచి 15 వరకు జరిగిన ఈఎంఆర్ఎస్ స్పోర్ట్స్ మీట్ 2025లో అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, జూడో, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, తైక్వాండో, యోగా, షూటింగ్, చెస్‌తోపాటు ఇతర ఈవెంట్లలో అన్ని రాష్ట్రాల కన్నా అత్యధికంగా తెలంగాణ విద్యార్థులు రికార్డు స్థాయిలో 230 పతకాలు గెలిచి ఓవరాల్ ఛాంపియన్స్‌గా నిలిచారు.
ఈ జాతీయ క్రీడల్లో తెలంగాణలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల సంస్థ(TGEMRS) ఆధ్వర్యంలోని 23 పాఠశాలల నుంచి 580 విద్యార్థులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల నుంచి 499 ఈఎంఆర్ఎస్ సంస్థలకు చెందిన 5,500 మంది విద్యార్థులు ఈ క్రీడల్లో పాల్గొన్నారు.
ఈ క్రీడల్లో నిర్వహించిన 22 ఈవెంట్లలో 15 వ్యక్తిగత ఈవెంట్లు, 7 టీమ్ ఈవెంట్లు ఉన్నాయి. వాటిల్లో దాదాపు అన్ని విభాగాల్లో తెలంగాణ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
ఈ క్రీడల్లో మొత్తం 230 పతకాలతో (88 బంగారు, 66 వెండి, 76 కాంస్యం), 714 పాయింట్లు సాధించి ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకొని తెలంగాణ కీర్తిని జాతీయ స్థాయిలో చాటారు. వీటిల్లో టీమ్ ఈవెంట్స్, వ్యక్తిగత ఈవెంట్లలోనూ తెలంగాణ విద్యార్థులు సత్తా చాటి అన్ని రాష్ట్రాల కన్నా అగ్ర భాగాన నిలిచారు.
EMRS Sports Meet 2025లో ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించిన నేపథ్యంలో విద్యార్థులు సీఎంని కలిశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ప్రశంసించారు. భవిష్యత్తులోనూ ఇదే క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
