- మెక్సికోలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
- భద్రతా విధానాలపై ప్రజల ఆగ్రహం
- రంగంలోకి పోలీసులు, సైన్యం
- కొనసాగుతున్న ఆందోళనలు
నేపాల్, బంగ్లాదేశ్ లాగే ఇప్పుడు మెక్సికోలో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జెన్ -జెడ్ యువత నిరసనకారులుగా బయటకు వచ్చి నేషనల్ ప్యాలెస్ బయట పెద్దగా ఆందోళనలు చేపట్టారు. వేలాదిమంది వీధుల్లోకి దూసుకెళ్తూ తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నిరసనకారులను పోలీసులు, సైన్యంతో దిగి అడ్డుకోవడానికి ప్రయత్నించగా, రాళ్లు విసరడం, లాఠీచార్జ్, టియర్ గ్యాస్ షెల్ల వినియోగం వంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఈ నిరసనలు ప్రధానంగా మెక్సికన్ ప్రభుత్వ భద్రతా విధానాలపై ప్రతికూల భావనతో సాగుతున్నాయి. దేశంలో నేరాల పెరుగుదల, అవినీతి, అదృశ్యమైన వ్యక్తుల సంఖ్య, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, కార్టెల్ల దుర్వినియోగాలు ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయి. 1 నవంబర్ 2025న మిచోకాన్ మేయర్ కార్లోస్ మాంజో హత్య యూత్ ఆగ్రహావేశాలని మరింత పెంచింది. మెక్సికో నగరంలోని నేషనల్ ప్యాలెస్ ముందు నిరసనకారులు గుమిగూడి నినాదాలు చేయగా, అధ్యక్షురాలు క్లాడియా షెన్బామ్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉండటంతో పోలీసులు, సైన్యం బారికేడ్లతో ప్రవేశం ఆపే ప్రయత్నం చేశారు. నిరసనకారులు వాటిని అధిగమించాలనగా, సైన్యం టియర్ గ్యాస్ షెల్లు ప్రయోగించింది .

దీనికి ప్రతిచర్యగా నిరసనకారులు పోలీస్, సైన్యంపై రాళ్లను విసిరారు. ప్రస్తుతం దేశంలోని 50కి పైగా నగరాల్లో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. మెక్సికో నగరం ఈ ఉద్యమానికి కేంద్రంగా మారింది. నేషనల్ ప్యాలెస్, పరిసర ప్రాంతాలను కంటోన్మెంట్ మార్చి భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేసారు. నిరసనకారులు రోడ్లు, మెట్రో, రైలు సేవలను అంతరాయం చేసినవల్ల, రైతులు, రవాణాదారులు కూడా సమ్మెకు చేరారు. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 100 మందికి పైగా గాయపడ్డారు. స్కూల్స్, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు రెండు రోజుల పాటు మూతబడ్డాయి. ఒకవైపు ప్రభుత్వం ఈ పరిస్థితిని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తుండగా, మరోపక్క యువత ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
