Tuesday, March 3, 2026
HomeజాతీయంBihar | బీహార్ సీఎం ఎవరు..?

Bihar | బీహార్ సీఎం ఎవరు..?

  • ఎన్డీయే భారీ విజయంతో చర్చలు
  • 19 లేదా 20న ప్రమాణ స్వీకారం?
  • కార్యక్రమానికి శరవేగంగా ఏర్పాట్లు
  • మరోమారు సీఎంగా నితీశ్..?
  • అధికారికంగా వెలువడని ప్రకటన

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి భారీ విజయంతో అధికారాన్ని మరోసారి సొంతం చేసుకున్న నేపథ్యంలో, రాష్ట్ర రాజకీయాలు రెండో దశకు చేరుకు న్నాయి. ఈ నెల 14న వెలువడ్డ ఫలితాలు ఎన్డీయేకు స్పష్టమైన మెజారిటీని అందించగా, కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై వివిధ వర్గాల్లో చర్చలు వేగంగా నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరుగుతుందనే ప్రశ్న ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో ఆసక్తికరమయిన చర్చలకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే, ఈ నెల 19 లేదా 20వ తేదీన నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి పాట్నాలోని గాంధీ మైదానం వేదికగా ఖరారు చేసే దిశగా పనులు దాదాపు పూర్తయ్యాయని అధికారులు చెప్తున్నారు. మైదానంలో వేదిక నిర్మాణం, భద్రతా ఏర్పాట్లు, అతిథుల కూర్చోవడానికి ప్రత్యేక మండపాల ఏర్పాట్లన్నీవేగంగా సాగుతున్నాయి.

ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారని, ఆయనతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల బృందం కూడా రావొచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్డీయే అధికార పీఠం మరోసారి దక్కించుకున్న నేపథ్యంలో ఈ వేడుకను భారీ స్థాయిలో నిర్వహించేలా కమిటీలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. నితీశ్ కుమా రను మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగించే అవకాశాలే బలంగా వినిపిస్తున్నాయి. గత పదేళ్లుగా ఎన్డీయేలో కీలక నేతగా, బీహార్ రాజకీయాల్లో కేంద్రబిందువుగా ఉన్న నితీశ్ను మరోసారి సీఎమ్ పదవికి ప్రతిపాదించడం సహజంగానే కనిపిస్తోంది. అయితే రాజకీయంగా ఎప్పటికప్పుడు వినూత్న మలుపులు తీసుకునే బీహార్ లాంటి రాష్ట్రాల నేపథ్యంలో, ఇప్పటి వరకూ ఎన్డీయే కూటమి తరఫున ఎలాంటి అధికారిక ప్రకటన రావడం లేదనే విషయం ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి బీజేపీ-జేడీయూ నేతల మధ్య జరిగిన చర్చల్లో, శాఖల నిర్వహణ, అధికార పంపకం, కూటమి వ్యూహం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయని తెలుస్తోంది. నితీశ్ కుమార్ నేతృత్వంపై సాధారణంగా గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పటికీ, అసెంబ్లీలో బీజేపీ బలం పెరగడం వల్ల కొత్త ప్రభుత్వంలో పార్టీ పాత్ర మరింత ప్రధానంగా మారవచ్చు. దీనికి అనుగుణంగా కీలక శాఖల కేటాయింపులపై మౌనంగా చర్చలు కొనసాగుతున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. మొత్తం మీద బీహార్ రాజకీయాలు ప్రస్తుతం ప్రమాణ స్వీకారం చుట్టూ తిరుగుతున్నాయి, అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందనే ప్రశ్న అందరిలోను ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. కూటమిలో అంతర్గత చర్చలు పూర్తి అవ్వగానే కొత్త ముఖ్యమంత్రి పేరును ఎన్డీయే ప్రకటించనుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News