HomeజాతీయంAir Chief Marshal | భారత సైన్యం నుంచి ఎవరూ తప్పించుకోలేరు..

Air Chief Marshal | భారత సైన్యం నుంచి ఎవరూ తప్పించుకోలేరు..

  • ‘ఆపరేషన్ సిందూర్’తో భారత్ సత్తా వెల్లడైంది..
  • భారత స్వదేశీ ఆయుధాల శక్తి ప్రపంచానికి తెలిసింది..
  • ఇండో – పసిఫిక్‌లో చైనా కదలికలపై నిరంతర నిఘా..
  • 2047 నాటికి ఐఏఎఫ్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతంగా మారుతుంది..
  • ధీమా వ్యక్తం చేసిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్..

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ భారత సత్తా ఏమిటో ప్రపంచానికి స్పష్టంగా నిరూపించిందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్(Air Chief Marshal AP Singh) స్పష్టం అన్నారు. భారత సాయుధ దళాలకు అందని లక్ష్యమంటూ ఏదీ లేదని, ఏ శత్రువైనా, ఏ ప్రాంతమైనా మన బలగాల పరిధిలోనే ఉందని స్పష్టం చేశారు. అక్టోబర్ 31న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్‌తో భారత వాయుసేన వ్యూహాత్మకంగా ముందడుగు వేసి, ఉగ్రవాదులను కోలుకోలేని దెబ్బ తీసిందని ఆయన వివరించారు.

గతేడాది మే నెలలో పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టామని ఏపీ సింగ్ గుర్తుచేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా 1,200 కిలోమీటర్ల వెడల్పు, 200 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై నిర్దిష్ట దాడులు చేశామని తెలిపారు. ఈ దాడుల ద్వారా ఏ ప్రదేశమైనా ఐఏఎఫ్ పరిధికి అతీతం కాదని తేల్చిచెప్పినట్లు అయిందన్నారు. ఆపరేషన్‌లో ఒక్క సామాన్య పౌరుడికి కూడా హాని కలగకుండా ‘జీరో కొలేటరల్ డ్యామేజ్’ సూత్రాన్ని కచ్చితంగా పాటించామని ఆయన గర్వంగా చెప్పారు.

- Advertisement -

ఈ ఆపరేషన్ విజయవంతం కావడం వెనుక కేవలం ఒక ఆయుధం లేదా ఒక విమానం మాత్రమే లేదని, కచ్చితమైన ఇంటెలిజెన్స్, నెట్‌వర్క్డ్ ఆపరేషన్స్, స్టాండ్-ఆఫ్ ఆయుధాలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, బహుళ-స్థాయి గగనతల రక్షణ వ్యవస్థల సమన్వయం ఉందని ఏపీ సింగ్ విశ్లేషించారు. ముఖ్యంగా, పాకిస్థాన్ సైన్యం ప్రయోగించిన డ్రోన్లు, ఇతర ఆయుధాలను మన స్వదేశీ గగనతల రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కొందని అన్నారు.

ఈ ఆపరేషన్‌లో కొన్ని స్వదేశీ ఆయుధ వ్యవస్థలు అద్భుతంగా పనిచేసి, శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్లి పెను నష్టాన్ని కలిగించాయని తెలిపారు. స్వదేశీ ఉత్పత్తి రక్షణ రంగాన్ని ఆధునికీకరించడమే కాకుండా, భారతదేశ వ్యూహాత్మక స్వావలంబనను బలోపేతం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుత ప్రపంచ అనిశ్చితి నేపథ్యంలో, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారతదేశ సామర్థ్యాలను ప్రదర్శించడం జాతీయ భద్రతకు చాలా కీలకమని ఎయిర్ చీఫ్ మార్షల్ అభిప్రాయపడ్డారు. ఆ వనరులు అధికంగా ఉండే ప్రాంతంలో చైనా సైనిక విస్తరణపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెరుగుతోందని, ఈ నేపథ్యంలో భారత వాయుసేన పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని చెప్పారు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడటానికి క్వాడ్ భాగస్వాములైన అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కలిసి భారత్ పనిచేస్తోందని తెలిపారు.

ఇటీవల ఆస్ట్రేలియా, మలేషియా, థాయ్‌లాండ్‌లలో ఐఏఎఫ్ జరిపిన విన్యాసాలు సుదూర, సముద్ర గగనతల కార్యకలాపాలలో అమూల్యమైన అనుభవాన్ని అందించాయని ఆయన వివరించారు. ‘వికసిత భారత్ 2047’ జాతీయ దార్శనికతకు అనుగుణంగా ఐఏఎఫ్ దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్నాయని ఏపీ సింగ్ తెలిపారు. 2047 నాటికి భారత వాయుసేనను ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన, వినూత్నమైన, సాంకేతికంగా స్వావలంబన కలిగిన బహుళ-డొమైన్ ఏరోస్పేస్ శక్తిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశానికి రక్షణ, భద్రత పునాదులని, ఆ లక్ష్య సాధనలో ఐఏఎఫ్ తన పూర్తి పాత్రను పోషిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News