- మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రక్షణకు చర్యలు
- డిజైన్, క్వాలిటీ లోపాలపై నివేదికల ఆధారంగా ముందుకెళ్తాం
- అధికారులతో సచివాలయంలో మంత్రి ఉత్తమ్ సమీక్ష
కాళేశ్వరం పునరుద్ధరణపై శాస్త్రీయ విధానంలో చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నామని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. భారీ వ్యయంతో నిర్మించిన ఆనకట్టల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. అయితే ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కసర్తతు జరుగుతోందన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల పునరుద్దరణకు శాస్త్రీయ, సాంకేతిక విధానంలో కసరత్తు జరుగుతోందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. అనకట్టల పునరుద్ధరణ సహా నీటిపారుదలశాఖకు సంబంధించిన వివిధ అంశాలపై ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో మంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
గత బిఆర్ఎస్ హయాంలో భారీ వ్యయంతో నిర్మించిన ఆనకట్టల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. మేడిగడ్డ అనకట్ట దెబ్బతినడానికి.. అన్నారం, సుందిళ్ల ఆనకట్టలో లీకేజీలకు గల కారణాలు, వైఫల్యాలను విజిలెన్స్, ఎన్డీఎస్, జ్యుడీషియల్ కమిషన్ నివేదికలు పేర్కొన్నాయని తెలిపారు. డిజైన్లు నిర్మాణం నిర్వహణలో లోపాలు, సరైన నమూనా అధ్యయనాలు లేకపోవడాన్ని ఎన్డీఎస్ఏ నివేదిక ప్రధానంగా ప్రస్తా వించిందని.. ఆర్థికపరమైన అవకతవకలు, ప్రణాళికాలోపాలను జ్యుడీషియల్ కమిషన్ పేర్కొందని తెలిపారు. అవకతవకలు, నిర్లక్ష్యం వహించినందుకు కొందరు అధికారులు, ఏజెన్సీలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిఫారసు చేసిందని మంత్రి పేర్కొన్నారు.
రాజకీయ పరంగా, ఇంజనీర్ల స్థాయిలోనూ లోపాలు ఉన్నాయన్న మంత్రి.. ఆనకట్టలను సాంకేతిక విధానంలో సరిచేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సీడీఓ లోపాలను కూడా విచారణ సంస్థలు ఎత్తిచూపినందున నైపుణ్యం కలిగిన సాంకేతిక సంస్థలు, కన్జలెంట్ల సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కన్జలెన్సీ సేవల కోసం పలు సంస్థలు ముందుకొచ్చాయని, 3 తుదిదశకు అర్హత సాధించాయన్న మంత్రి.. ఐఐటీ లాంటి సంస్థలతో కలిసి పనిచేసే వాటికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సీడబ్ల్యూపీఆర్ఎస్ అవసరమైన పరీక్షలు చేస్తోందని, వరద ఉదృతి తగ్గిన వెంటనే మరో 15, 20 రోజుల్లో జియోఫిజికల్, హైడ్రాలిక్ పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు.
