Friday, February 27, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంSeed Authority | డిప్యుటేషన్ ముసుగులో పదేళ్ల దోపిడీ!

Seed Authority | డిప్యుటేషన్ ముసుగులో పదేళ్ల దోపిడీ!

సీడ్ సర్టిఫికేషన్ డైరెక్టర్ అవినీతి, అక్రమాలు
విదేశాలలో విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన డైరెక్టర్ కేశవులు
అమెరికా టూర్ కు రూ.70 లక్షల ప్రభుత్వ సొమ్ము ఖర్చు
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మరో 15 విదేశీ టూర్లు
సీడ్ సర్టిఫికేషన్ సంస్థలో రూ.50 కోట్లకు పైగా దుర్వినియోగం

హైదరాబాద్, నవంబర్ 11 (ఆదాబ్ హైదరాబాద్): రాష్ట్రంలోని విత్తన ధృవీకరణ సంస్థ(Telangana State Seed & Organic Certificaion Authority)కు స్వయంప్రతిపత్తి ఉంది. విత్తనాల నాణ్యత, వాటి ధృవీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సైతం అధికారాలు పరిమితంగానే ఉంటాయి. ఇతర వ్యక్తులు, రాజకీయ నాయకుల ప్రమేయం ఉండొద్దనే ప్రధాన ఉద్దేశంతో విత్తన చట్టం-1966 ప్రకారం ఒక ఇండిపెండెండ్ ఆటానమస్ స్టాట్యుటరీ బాడీలు(Independent Autonomous Statutory Bodies)గా దేశంలో సీడ్ సర్టిఫికేషన్ అథారిటీలను ఏర్పాటుచేశారు. అంతేకాకుండా వాటి పర్యవేక్షణ సమర్థవంతంగా ఉండాలని, ఇతర కార్పొరేషన్ల పోలిటికల్ చైర్మన్ల మాదిరిగా కాకుండా, రాష్ట్ర వ్యవసాయ సెక్రటరీలు (ఐఏఎస్‌లు) వీటి చైర్మన్లుగా నియమించారు. ఈ విధంగా ఈ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీలు, రాష్ట్ర స్థాయిలో ఉండే స్టేట్ సీడ్స్ కార్పొరేషన్లతో పాటు, ఇతర ప్రైవేట్ విత్తన కంపెనీలు ఉత్పత్తి చేసే విత్తనాల నాణ్యతను తనిఖీ చేసి, ధృవీకరించి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించటంలో అత్యంత కీలకంగా వ్యవహరించాలి, కానీ, మన రాష్ట్రంలో ఇందుకు భిన్నంగా జరుగుతుంది. డిప్యూటేషన్ పై వచ్చిన డైరెక్టర్‌(Director)దే ఇష్టారాజ్యం అయింది. విత్తనాల నాణ్యత, రైతుల సంక్షేమం దేవుడెరుగు.. కానీ డైరెక్టర్‌కు మాత్రం విదేశీ టూర్లకు వేదికగా సదింది.

- Advertisement -

విదేశీ టూర్లు.. విలాసవంతమైన జీవితం…. (Foreign tours.. luxurious life….)

ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆచార్యులు డా. కేశవులు (Keshavulu) గత ప్రభుత్వంలో రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థకు డిప్యూటేషన్‌(Deputation)పై డైరెక్టర్‌గా వచ్చారు. డిప్యూటేషన్‌ను కొనసాగిస్తూ దశాబ్ద కాలం డైరెక్టర్‌గా కొనసాగుతూ ఉన్నారు. ఈ పదేళ్ళ కాలంలో సుమారు 385 రోజులు విదేశాల్లో గడిపేశారు. అంటే సుమారు ఏడాది కాలం పాటు విదేశీల్లోనే గడిపారు. పదేళ్ల కాలంలో 25 దేశాల్లో 50 సార్లు చక్కర్లు కొట్టారు. ఇందుకు చేసిన ఖర్చు సుమారు రూ.2 కోట్ల పైమాటే. కేవలం మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఏ ముఖ్యమంత్రి (CM) కూడా ఈ తరహాలో విదేశీ పర్యటనలు చేసి ఉండరు. అసలు విషయానికొస్తే.. వీరిని విదేశీ పర్యటనకు ఎవరు పిలిచారు. వీరు ఎందుకు వెళ్ళారు, అక్కడేం జరిగింది, కొత్తగా ఏం నేర్చుకొని వచ్చారు. విదేశీ పర్యటనల వల్ల కలిగిన లాభం ఏంటీ అనేది నేటికి కూడా కోటి డాలర్ల ప్రశ్నగానే మిగిలింది. వెళ్లిన 50 ఫారిన్ టూర్లకు సంబందించి ఏ ఒక్క టూర్ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి సమర్పించకపోవడం గమనార్హం. ఫారన్ టూర్‌కు వెళ్ళినప్పుడల్లా డైరెక్టర్ ఇన్‌ఛార్జ్ పదవిని ఎవరికీ ఇవ్వకుండా వెళ్లి రావడం మరో ప్రత్యేకత. డా.కేశవులు ఫారిన్ టూర్‌లో ఉన్నన్ని రోజులు ఎవరి ఆధ్వర్యంలో విత్తన దృవీకరణ సంస్థ నడిచిందనేది కూడా మరో సందేహం. ఇదే కాకుండా విదేశీ పర్యటనలకు కూడా ప్రభుత్వాల నుంచి అనుమతి లేకుండానే పోయి వస్తుంటారనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే.. ఈ సంస్థకు డైరెక్టర్ లేకున్నా కూడా నడుస్తుందనే విషయాన్ని ఆచార్య కేశవులు నిరూపించారు.

రాజకీయ నాయకులతో కలిసి ఖరీదైన విదేశీ పర్యటనలు

డా.కేశవులు గత ప్రభుత్వంలోనే కాదు.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా విదేశీ పర్యటనలను చేస్తూనే ఉన్నారు. ఎంతైనా విదేశీ పర్యటనలకు అలవాటు పడిన ప్రాణం కదా.. ఇంకా నన్నెవరూ ఏమీ చేయలేరనే ధీమాతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా కనీసం అనుమతి కూడా తీసుకోకుండానే అర్జెంటీనా, యూరప్, అమెరికా, UK, ఇథియోపియా తదితర 15 విదేశీ పర్యటనలు చేశారు. వీరి విదేశీ పర్యటనలకు అయ్యే ఖర్చులన్నీ కూడా ప్రభుత్వ సంస్థనే భరించింది. అంతటితో ఆగకుండా నిబంధనలకు విరుద్ధంగా ఫర్ డెమ్ (TA, DA) కింద సుమారు రూ. 24 లక్షల రూపాయలను డైరెక్టర్ డా. కేశవులు తీసుకున్నారు. 2023 అక్టోబర్ 22 నుంచి 29 వరకు వెళ్ళిన అమెరికా టూర్ కు ఏకంగా రూ.70 లక్షలు ఖర్చులు చేశారు. అనేక విదేశీ టూర్లకు సంస్థ డబ్బులు ఖర్చు పెట్టి, వనపర్తి, బాన్సువాడ, వేములవాడ, ఖమ్మం, దేవరకద్ర, నర్సంపేట, వికారాబాద్, దేవరకొండలకు చెందిన రాజకీయ నాయకులను కూడా తీసుకెళ్లారనే విమర్శలున్నాయి. ఇదే కాదు, పదేళ్ళల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలకు 100 కు పైగా ఎకానమీ క్లాస్ లో ఫ్లైట్ జర్నీలు చేశారు. వీటిలో పావు వంతు కూడా విత్తన ధృవీకరణ సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. విదేశాల్లో విలాసవంత జీవితానికి అలవాటుపడిన డైరెక్టర్‌కు రైతులు, విత్తనాల నాణ్యత ఏం పట్టింపు ఉంటుంది.

ఒక మీటింగ్ ఖర్చు రూ. కోటి…

డబ్బులు ఎలా ఖర్చు చేయాలో ప్రొ. కేశవులుకు బాగా తెలుసు. సంస్థ సామ్యను పొదుపు చేయడం కంటే.. ఖర్చుల రూపంలో మాయం చేయడంలో అందెవేసిన చెయ్యిగా చెప్పుకోవచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2018 జూన్ 4న నోవాటెల్ హెూటల్ లో రైతు సమన్వయ సమితి (RSS) మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ పేరుతో సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ నుంచి రూ.94 లక్షలు ఖర్చు చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం అని AG ఆడిటింగ్ అధికారులు జరిపిన ఆడిటింగ్ రిపోర్ట్ లో స్పష్టం చేశారు. ఇదే కాకుండా ఈ ఖర్చుకు సంబంధించిన వివరణ కోరితే సరైన సమాచారం ఇవ్వలేదు. ఈ రోజుకి కూడా సుమారు కోటి రూపాయాల సంగతి పెండింగ్‌లోనే ఉంది. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. గత ప్రభుత్వంలో డైరెక్టర్ డా. కేశవులు బీఆర్ఎస్ నాయకుల ఆదేశాల ప్రకారం, నిబంధనలకు విరుద్ధంగా ఇష్టమొచ్చినట్లు సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు.

ల్యాబ్ లు, భవనాలు నియోపయోగంగా..
ఇదే మోడల్ సీడ్ సర్టిఫికేషన్ అధారిటీ నమూనా..

ఒకవైపు రోజు రోజుకి విత్తన దృవీకరణ విస్తీర్ణం పడిపోతూ ఉంది. మరోవైపు రాజకీయ నాయకుల మెప్పుకోసం అవసరం లేకున్నా రూ.5 కోట్లు ఖర్చు పెట్టి కొత్త డివిజన్ల పేరుతో ఆఫీసు బిల్డింగుల నిర్మాణాలను చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు నియోజకవర్గమైన సిద్దిపేటలో రూ.2 కోట్లు, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నియోజకవర్గమైన వనపర్తిలో రూ. కోటి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నియోజకవర్గమైన సూర్యాపేటలో రూ.2 కోట్లు ఖర్చు పెట్టి డివిజన్ ఆఫీసులను నిర్మించారు. ఇవాల్టి వరకు ఆయా ఆఫీస్ లకు ఏ ఒక్క అధికారిని కేటాయించలేదు. వాటి కింద ఒక్క ఎకరం సీడ్ సర్టిఫికేషన్ ఏరియా కూడా రిజిస్ట్రే షన్ కాలేదు. అవి ప్రస్తుతం నిరూపయోగ స్థితిలో ఉన్నాయి. 2014లో కరీంనగర్ లో కేంద్ర ప్రభుత్వ సీడ్ బ్యాంక్ నిధులతో రూ.1.10 కోట్లు ఖర్చు పెట్టి సీడ్ టెస్టింగ్ ల్యాబ్ నిర్మాణం చేపట్టారు. ఆ తరువాత ల్యాబ్ లో విత్తన పరీక్షలను ప్రారంభించేందుకు అవసరమైన టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టు లను మంజూరు కూడా చేశారు. 2014-15లో 1584 విత్తన శ్యాంపిల్స్ పరీక్షిస్తే 2018 వచ్చేసరకి ఆ సంఖ్య సున్నాకు చేరింది. డా.కేశవులు డైరెక్టర్ పదవి చేపట్టిన తరువాత కరీంనగర్ ల్యాబ్ లో విత్తన పరీక్షలు చేయడమే మానేశారు. ప్రస్తుతం ఆ ల్యాబ్ కూడా నిరూపయోగంగానే ఉంది.

తెలంగాణ ప్రభుత్వం, జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలో రాజేంద్రనగర్ లో సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ గ్రో ఆవుట్ టెస్ట్ (GOT) ఫామ్ కొరకు 5 ఎకరాల భూమిని కేటాయించింది. దీన్ని సరిగా విని యోగించుకోలేకపోయారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల నుంచి రూ.50 లక్షల నిధులు వస్తే వాటిని ఒక కాంట్రాక్టర్ కు చెల్లించి కమీషన్లు కొట్టేశారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం GOT ఫామ్ కొరకు కేటాయించిన భూమి నిరూపయోగంగా ఉంది. అడవిని తలపిస్తూ, ముళ్ళ పొదలతో నిండిపోయింది. ఇదే విషయం మీడియా కంట పడగానే, మొక్కుబడిగా, తనను తాను కాపాడుకోవటానికి వెంటనే GOT ఫామ్ ను రూ.లక్షలు వెచ్చించి బుల్డోజర్లు పెట్టి క్లీన్ చేయించి పదిలేశారు. చివరకు విత్తన శ్యాంపిల్స్ టెస్టింగ్ కి మాత్రం ఆ ఫామ్ నోచుకోవట్లేదు. 2021లో రూ.28 లక్షలు ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వ నిధులతో రైతులకు అవగాహన కల్పించటం కోసం TOUC6538 నంబర్ గల స్వరాజ్ మజ్దా బస్సును AV మోటార్స్ నుంచి కొనుగోలు చేయటం జరిగింది. ఆ బస్సుకు విత్తన రథం అని పేరు పెట్టి గొప్పలు చెప్పుకున్నారు. ఆ బస్సు జిల్లాల్లో ఎక్కడ తిరిగిందో, ఎక్కడా ఒక్క రికార్డ్ లేదని AG ఆడిటింగ్ అధికారులు కూడా ప్రశ్నించడంతో నివ్వెరపోయారు. ఇలా లక్షలు పెట్టి కొన్న బస్సు ప్రస్తుతం నిరూపయోగంగా, జీడిమెట్ల సీడ్ కార్పొరేషన్ ఆఫీస్ లో ఒక షెడ్డులో తుప్పు పట్టి ఉంది.

హంగు ఆర్భాటాల కోసం ప్రభుత్వ సొమ్ము వృధా

గత ప్రభుత్వంలో ఒక దశాబ్దంగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రుల అండదండలతో డైరెక్టర్ డా. కేశవులు అసలు సీడ్ సర్టిఫికేషన్ పనిని పక్కనబెట్టి, పొంగు ఆర్భాటాల కోసం కొన్ని కోట్ల రూపాయాల సంస్థ రెవెన్యూ, ప్రభుత్వ నిధులు విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారు. సీడ్ హబ్ అని గొప్పలు చెప్పుకోవటమే తప్ప విత్తన దృవీకరణ సంస్థ గానీ విత్తన పరిశ్రమ గానీ విత్తన రైతులు గానీ ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. మునుపటి కంటే ఎంతో అధ్వాన్నంగా సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ పరిస్థితి తయారయ్యింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News