Thursday, March 5, 2026
Homeఆంధ్రప్రదేశ్Chandrababu Naidu | విపత్తును మిగిల్చిన మొంథా తుఫాన్

Chandrababu Naidu | విపత్తును మిగిల్చిన మొంథా తుఫాన్

  • రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది
  • ఆస్తి నష్టం చాలా వరకు తగ్గేలా చర్యలు
  • పలు జిల్లాల్లో వరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి
  • రైతులను, కౌలు రైతులను ఆదుకుంటాం
  • సత్వర నివేదికలు సిద్ధం చేసి కేంద్రానికి పంపిస్తాం
  • పునరావాస కేంద్రంలో ప్రజలకు బాబు పరామర్శ
  • ఏరియల్ సర్వే ద్వారా పరస్థితిని సమీక్షించిన సీఎం

మొంథా తుపాను పెనువిపత్తని.. రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రోడ్డుమార్గంలో వెళ్లి అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో పునరావాస కేంద్రాన్ని పరిశీలించి, తుపాను బాధితులను పరామర్శించారు. బాధితులకు నిత్యావసరాలు, పరిహారం అందించారు. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడుతూ..మొంథా తుపానుపై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. గతంలో తుపానుల సమయంలో పనిచేసిన అనుభవం నాకు ఉంది. ముందు జాగ్రత్తలు తీసుకుని ప్రాణనష్టం లేకుండా చూశాం.

ఆస్తి నష్టం కూడా చాలా వరకు తగ్గేలా చర్యలు తీసుకున్నాం. పలు జిల్లాల్లో వరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షం నమోదైంది. ఆస్తి నష్టంపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటాం. కౌలు రైతులకు పరిహారం అందిస్తాం. మత్స్యకారులు, చేనేత కార్మికులకు అదనంగా 50 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నాం అని సీఎం తెలిపారు. మొంథా తుఫాను ప్రభావం వల్ల ఏపీలో పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తుఫాను కారణంగా చేతికి అందివచ్చిన పంట పాడైపోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మొంథా తుఫాను వల్ల జరిగిన ప్రాథమిక నష్టాన్ని ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా మొంథా తుఫాను కారణంగా నష్టపోయిన రైతులని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే రెండు రోజుల్లో అధికారులు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

- Advertisement -

సీఎం ఆదేశాలతో శరవేగంగా అధికారులు పంట నష్టంపై వివరాలు తెలుసుకుంటున్నారు. అయితే, ప్రాథమిక అంచనాలు వచ్చాక కేంద్ర ప్రభుత్వానికి నివేదించనుంది ఏపీ ప్రభుత్వం. 249 మండలాలు, 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మందిపై తుఫాను ప్రభావం ఉందని అధికారులు గుర్తించారు. మొంథా తుఫానుతో ఏపీలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని అధికారులు తెలిపారు. మొంథా తుఫానుతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పంట నష్టంపై అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. జిల్లాలో పంటలు భారీగా దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చారు. 10 వేల హెక్టార్లలో వరిపంట దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. 5 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం కలిగినట్లు అధికారులు గుర్తించారు. అలాగే, రెండు వేల ఎకరాల్లో రొయ్యల చెరువులు నీట మునిగాయని అధికారులు తెలిపారు.

తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితుల కోసం ప్రోటోకాల్ను పక్కనపెట్టారు. సీఎం కాన్వాయ్ వెహికల్లో కాకుండా ఇన్నోవా కారులోనే బాధితుల వద్దకు వెళ్లారు. సాధారణ వాహనంలోనే బాధితుల దగ్గరకు వెళ్లారు. అల్లవరం మండలంలోని ఓడరేవుల సమీపంలో ఉన్న పునరావాస శిబిరాన్ని ముఖ్యమంత్రి సందర్శించారు. పునరావాస బాధితులకు 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. దాదాపు అరగంట సేపు పునరావాస శిబిరంలోనే గడిపారు. పునరావాస శిబిరంలో వసతుల కల్పనపై బాధితులను అడిగి తెలుసుకున్నారు. అరగట్ల పాలెం, బెండమూరు లంక గ్రామాల్లో నీట మునిగిన పొలాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు.

రైతులను కలిసి మాట్లాడి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. డ్రైనేజీ, గుర్రపు డెక్క సమస్య ఉందని, వాటిని క్లియర్ చేయాలని రైతులు ముఖ్యమంత్రిని కోరారు. రైతులు చెప్పిన విధంగా డ్రైన్లను క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News