Friday, February 27, 2026
Homeసాహిత్యంప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో వార్తాపత్రికలు

ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో వార్తాపత్రికలు

  • 29 జనవరి “భారతీయ వార్తాపత్రికల దినోత్సవం” సందర్భంగా

ఉదయం తలుపులు తెరవగానే వార్తాపత్రిక శుభోదయం అంటూ ముడిచుకుపోయి పలకరిస్తుంది. ప్రతి రోజు ఉదయం వార్తల విందును వడ్డిస్తుంది. దినపత్రిక చూడని రోజు ఏదో తెలియని వెలితి వెంటాడుతుంది. వార్తాపత్రిక రాని వేళ మనసు నిలవదు, దినచర్య సజావుగా సాగదు. కాఫీ చప్పరిస్తూ పేపర్‌ చదివితే ఆ మజానే వేరు. దినపత్రిక ఉషోదయాన చదవడమనే అలవాటు ఉన్న వారు ఎందరో. ప్రజాస్వామ్య సౌధానికి, పార్లమెంటరీ వ్యవస్థకు 4వ పిల్లర్‌గా పిలువబడే మీడియా నేడు పలు సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఇలాంటి పలు రకాల మీడియాల్లో వార్తాపత్రికలు ప్రముఖంగా నిలబడుతూ ప్రతి దినం ప్రపంచ వార్తలను మన కళ్ల ముందు ఉంచుతాయి. దేశ గళాలుగా పత్రికలు నిలుస్తున్నాయి. ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య పటిష్టమైన వారధిగా పత్రికలు సేవలు చేస్తున్నాయి. అవినీతిని బయట పెట్టడం, అక్రమార్కుల భరతం పట్టడం, సమ్మిళిత అభివృద్ధికి ఉత్ప్రేరకంగా నిలవడం, పేదల పక్షాన నిలబడి పోరాడడం లాంటి ప్రధాన కర్తవ్యాలను నిర్వహిస్తున్న వార్తాపత్రికల మనుగడను నేటి డిజిటల్‌ సాంకేతిక వేదికలు మసకబార్చుతున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రతిరూపంగా వార్తాపత్రికలు నిలవాలి. నేటి ఆధునిక భారతంలో వార్తాపత్రికలు ప్రభుత్వాలకు వంత పలకడం, ఏదో ఒక పక్షాల నిలిచి వార్తలను తమకు అనుకూలంగా రాయడం లాంటి పోకడలతో ప్రజల్లో వార్తాపత్రికల మీద ఉన్న సదాభిప్రాయాన్ని సన్నగిల్లేలా చేస్తున్నానే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. విలువలతో కూడిన నిష్పక్షపాత వార్తలను అందించే పత్రికలు రోజు రోజుకు తగ్గుతున్నాయనే అభిప్రాయం కూడా క్రమంగా బలపడుతున్నదని నిపుణులు, విశ్లేషకులు వాపోతున్నారు.

భారత తొలి వార్తాపత్రిక ‘హిక్కీస్‌ బెంగాల్‌ గెజిట్‌’:
మానవాళి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, సామాజిక న్యాయాలు, ప్రభుత్వ పాలనలో మంచి చెడ్డలు, పౌరసమాజాన్ని జాగృత పరచడం, పౌరులకు అవసర సమాచార వితరణ లాంటి ప్రధాన భూమికలు నిర్వహిస్తున్న నేటి వార్తాపత్రిక ప్రాధాన్యాన్ని ప్రచారం చేయడంతో పాటు జర్నలిస్టులు, ఎడిటర్లు, పబ్లిషర్ల అమూల్య సేవలను ప్రస్తుతించడానికి ప్రతి ఏట 29 జనవరి రోజున మన దేశంలో “భారతీయ వార్తాపత్రికల దినోత్సవం(ఇండియన్ న్యూస్ పేపర్స్‌ డే)” నిర్వహించుట ఆనవాయితీగా మారింది. భారతదేశంలో తొలిసారి జేమ్స్‌ ఆగస్టస్‌ హెక్కీ నాయకత్వంలో “హిక్కీస్‌ బెంగాల్‌ గెజిట్‌” అనే వారపత్రిక కలకత్తా నుంచి 29 జనవరి 1780న వెలువడింది. ఈ వార్తా పత్రిక నిష్పక్షపాతంగా, నిక్కచ్చిగా వార్తలను ప్రజలకు చేర్చడంతో భయపడిన నాటి బ్రిటీష్‌ ప్రభుత్వం 1782లో దానిని రద్దు చేయడం కూడా జరిగింది.

- Advertisement -

వార్తాపత్రికల ప్రాధాన్యం:
ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం, ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య అనుసంధాన కర్తలుగా నిలవడం, భావప్రకటనా స్వేచ్ఛను కాపాడడం, అవినీతి అక్రమాలు జరుగకుండా ‘వాచ్‌డాగ్’‌ వలె పని చేయడం, పేదల పక్షపాతిగా నిలవడం, సమయానుకూలంగా ప్రపంచ వార్తలను మన ఇంటికి/కంటికి/మనసు లోతుల్లోకి చేర్చడం, ప్రజలను బలోపేతం చేయడం, ప్రభుత్వాలు నిర్ణయాలను తీసుకోవడంలో సహకరించడం, ప్రజల బతుకు వెతలను వేలెత్తి చూపడం, ప్రజలను చైతన్యవంతం చేయడం లాంటి అనేక ప్రధాన ప్రయోజనాలను కలిగిస్తున్న వార్తాపత్రికలు మానవాళి నిత్యజీవితంగా ఓ ప్రధానమైన భాగమై మన జీవితాలతో అవిభాజ్యమైన అనుబంధాలను కలిగి ఉన్నాయి. ఇలాంటి ప్రయోజనాలకు తోడుగా ప్రజలను విద్యావంతులుగా మార్చడం, చదివే కళను పెంచి పోషించడం, సమాచార జ్ఞాన నైపుణ్యాలను పెంచడం, పారిభాషిక పదకోశాలను పెంచడం, భాషపై పట్టు సాధించే సాధనాలుగా ఉపయోగం, సమకాలీన సమస్యలను లోతుగా విశ్లేషించడం, పౌరసమాజ మంచి చెడ్డలను బయట పెట్టడం, రహస్య చీకటి ఒప్పందాలను బయట పెట్టడం లాంటి పలు అదనపు ప్రయోజనాలను వార్తాపత్రికలు కలిగి ఉన్నాయి. పత్రికా స్వేచ్ఛయే ప్రజాస్వామ్యం అని, జర్నలిజం లేకుండా నిజమైన స్వేచ్ఛరాదని తెలుసుకుందాం. సమ్మిళిత సామాజిక అభివృద్ధికి పత్రికలు ఉత్ప్రేరకాలు అని, వార్తాపత్రికలు ప్రజలకు అమూల్య సేవకులని భావించాలి.

వార్తాపత్రికలు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు:
డిజిటల్‌ టెక్నాలజీ వరదలో సంప్రదాయ వార్తాపత్రికల ఆదరణ క్రమంగా కొట్టుకుపోతున్నది. ఆన్‌లైన్‌ పత్రికలు, సోషల్‌ మీడియా పోస్టింగ్స్‌తో పాఠకుల్లో వార్తాపత్రికల పట్ల దృష్టికోణం మారుతున్నది. క్షణాల్లో డిజిటల్‌ వేదికల్లో ప్రపంచ వార్తలు ప్రజలకు చేరుతున్నాయి. టివీ చానెల్స్‌ 24 గంటల వార్తలతో పేపర్‌ చదవాలనే వాంఛ కూడా క్రమంగా తగ్గుతున్నది. వార్తాపత్రికల్లో ప్రకటనల రెవిన్యూ తగ్గడం, వినియోగదారుల అభిరుచులు మారడం, వార్తాపత్రికల మధ్య పోటీతత్వం పెరగడం, వార్తాపత్రికల ముద్రణ/నిర్వహణ ఖర్చులు పెరగడం, ప్రాంతీయ భాషలు పుట్టుకురావడం, డిజిటల్‌ వేదికలు ఏకీకరణ కాకపోవడం, వార్తాపత్రికపై నమ్మకాలు సన్నగిల్లడం, పర్యావరణ అంశాలు, ఎల్లో జర్నలిజం, కరోనా విపత్తు లాంటి సవాళ్ల నడుమ వార్తాపత్రికల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది, మారుతూనే ఉన్నది. రానున్న రోజుల్లో వార్తాపత్రిక మనుగడ సుసాధ్యం కావడానికి నిక్కచ్చి వార్తలను అందించడం, నాణ్యమైన సమాచారం చేరవేయడం, డిజిటల్ ఇంటిగ్రేషన్‌ సాధించడం, ప్రతిభావంతులైన నిజాయితీపరులు మాత్రమే విలేకరులుగా సేవలు అందించడం, తటస్థ పాత్రలో పత్రికలను నడపడం, పాఠకుల అభిరుచుల ఆధారంగా పత్రికల్లో సమయానుకూలంగా మార్పులు చేయడం, ప్రభుత్వాలు తమ ప్రకటనలతో ప్రోత్సహించడం, మెరుగైన ఖచ్చితమైన సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం లాంటి చర్యలు తీసుకోవడం పత్రికా యాజమాన్యాలకు తప్పనిసరి అని గమనించాలి.

వేగవంతమైన డిజిటల్‌ నరుడికి పేపరు చదివే ఓపిక సన్నగిల్లడంతో సంప్రదాయ వార్తాపత్రికల మనుగడ ప్రమాదకరంగా మారుతున్నది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని “భారతీయ వార్తాపత్రికల దినోత్సవ” వేదికగా పౌర సమాజం పత్రికను ఆదరిస్తూ, అన్ని విషయాలను అంశాలను అవగాహన చేసుకుంటూ బాధ్యతగల పౌరులుగా నిలుద్దాం, మన వార్తాపత్రికలను మనమే కాపాడుకుందాం.

డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037

- Advertisement -
RELATED ARTICLES

Latest News