కోత చెరువులో 16 అక్రమ విల్లాలు..
ఇరిగేషన్ నివేదికతో బట్టబయలు..
- కోత చెరువును కబళించిన రియల్ మాఫియా!
- రికార్డుల్లో చెరువు లేదు.. నేలపై నీటి జాడలు!
- హైకోర్టు ఆదేశాలతో సర్వే.. అక్రమ నిర్మాణాల గుర్తింపు
- ఎఫ్టీఎల్లో 12 విల్లాలు.. బఫర్ జోన్లో మరో 4
- 11.715 ఎకరాల ఎఫ్టీఎల్ విస్తీర్ణం ఉన్న చెరువు.
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం(Maheswaram Mandal), సిరిగిరిపురం గ్రామ పరిధిలోని కోత చెరువు(Kotha Cheruvu) అన్యాక్రాంతం అవుతున్న వైనంపై ఇరిగేషన్ శాఖ బట్టబయలు చేసిన నిజాలు అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సంయుక్త పరిశీలనలో వెలుగు చూసిన వివరాలు చూస్తే.. జలవనరులను కబలించాలనే రియల్ మాఫియా దుర్మార్గపు ఆలోచనలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టమవుతోంది. మ్యాపుల్లో చెరువు మాయమైనా, క్షేత్రస్థాయిలో నీటి జాడలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ అక్రమార్కులు సాగిస్తున్న దురాక్రమణలు చట్ట నిబంధనలకు పెను సవాలుగా మారుతున్నాయి.
గ్రామ రెవెన్యూ మ్యాప్‌లో, సర్వే ఆఫ్ ఇండియా టోపోషీట్లో ఈ భూములపై నీటి వనరు లేదంటూ రికార్డులను తారుమారు చేసే కుట్రలు జరిగినట్లు స్పష్టమవుతోంది. కానీ, నేల స్వభావం, మట్టి కట్ట, అదనపు నీరు పోయే అలుగు (సర్ప్లస్ వీర్), నిల్వ నీరు వంటి భౌతిక లక్షణాలు అక్కడ దశాబ్దాలుగా సజీవంగా ఉన్న జల వనరును కళ్ళకు కడుతున్నాయి. రికార్డుల్లో కావాలనే నీటి వనరును మాయం చేసి, అమాయక ప్రజలను, ప్రభుత్వాన్ని మోసం చేస్తూ పూర్తిస్థాయి నీటిమట్టం (FTL), బఫర్ జోన్లను(Buffer Zone) ఆక్రమించుకునేందుకు(encroachment) పన్నిన పన్నాగం ఈ నివేదికతో బహిర్గతమైంది.
నిబంధనలకు తూట్లు పొడుస్తూ 16 విల్లాల నిర్మాణం : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచఎండీఏ) రికార్డుల ప్రకారం లేక్ ఐడీ 2400/ఈఎన్/01 కలిగి, 11.715 ఎకరాల ఎఫ్టీఎల్ విస్తీర్ణం ఉన్న కోత చెరువును సైతం కబ్జాదారులు వదలలేదు. హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన సర్వేలో ఎఫ్టీఎల్ పరిధిలో 12 విల్లాలు, బఫర్ జోన్లో మరో 4 విల్లాలు, తాత్కాలిక నీలిరంగు షెడ్లతో కలిపి మొత్తంగా 16 విల్లాలు అక్రమంగా వెలుస్తున్నట్లు తేలింది.

జీవో ఎంఎస్ నంబర్ 168 నిబంధనలను తుంగలో తొక్కి, నీటి వనరుల సమీపంలో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకూడదన్న కనీస స్పృహ లేకుండా సాగుతున్న ఈ కబ్జా పర్వం అధికారుల కళ్ళ ముందే జరుగుతుండటం విస్మయకరం. ఇరిగేషన్ శాఖ తన నివేదికలో ఎఫ్టీఎల్ పరిధిలో 03-25 గుంటలు, బఫర్‌లో 00-22.5 గుంటల మేర ఆక్రమణలు జరిగినట్లు గూగుల్ ఎర్త్ చిత్రాలతో సహా తేల్చిచెప్పింది.
కొనుగోలుదారుల ఆందోళన.. సామాజిక కార్యకర్తల హెచ్చరిక.. : ఇప్పటివరకు ఈ విల్లాలు కొనుగోలు చేసిన ప్రజలు ఈ వాస్తవాలను గమనించాలని సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. అక్రమ భూముల్లో, చెరువు ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్లో నిర్మించిన ఈ విల్లాలను కొని ప్రజలు మోసపోవద్దని, ఇప్పటికే డబ్బులు చెల్లించిన వారు ఆయా నిర్మాణ సంస్థల నుంచి తమ సొమ్మును వెంటనే రికవరీ చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తప్పుడు సమాచారంతో, మోసపూరిత హామీలతో ఇళ్లను అంటగట్టిన నిర్మాణ సంస్థలపై చట్టపరంగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

తక్షణమే కూల్చివేతలు చేపట్టాలని సర్వత్ర డిమాండ్ : ఇరిగేషన్ శాఖ స్పష్టంగా సమర్పించిన నివేదిక ప్రకారం.. చెరువును ఆక్రమించి చేపట్టిన ఈ అక్రమ నిర్మాణాలపై(Illegal Construction) స్థానిక తహసీల్దార్ తక్షణమే రంగంలోకి దిగి కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్ర డిమాండ్ వ్యక్తమవుతోంది. కేవలం కాగితాల మీద నివేదికలు పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు. చెరువులను కాపాడాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ఇకనైనా నిద్రమత్తు వీడి, ప్రజాధనాన్ని, పర్యావరణాన్ని నాశనం చేస్తున్న రియల్ మాఫియాపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి.
