ఇక్కడ చీకటి రాత్రుల్లో నన్ను
జోకొట్టి నిద్ర పుచ్చేది!
కళ్లలో కన్నీటిని దాచి
పెదాలతో సంతోషాన్ని పంచేది!
ఒక్కొక్కప్పుడు
మధురమైన క్షణాలను
ఆప్యాయతలను చెవిలో చెప్పేది!
మనసు కలత చెందకుండా
మాధుర్య మమతలను పంచేది!
సుతిమెత్తని స్పర్శల పొత్తిళ్లపై
ఒట్టిపోని కవిత్వాన్ని
నా ఖాళీపుటలపై లిఖించేది!
స్వచ్ఛమైన నిర్మలమైన
ప్రేమను నిరంతరంగా అందించేది!
స్నేహపూరితంగా నన్ను తాకేది
కౌగిలింతతో దగ్గరకు తీసుకునేది!
ఒక్కోసారి నా కన్నీటిని
తన చీరతో తుడిచేది!
కలల ఉయ్యాల్లో నన్ను
నెమ్మదిగా ఊపేది!
ఆకలి అనే బాధను తెలియకుండా
కడుపు నింపేది!
మొత్తం ప్రపంచంతో అలిగి
నేను కోపంతో నిద్రపోయినపుడు!
నెమ్మదిగా నాపైకి దుప్పటి లాగి
తన కొంగులో నన్ను దాచుకునేది!
ఇప్పుడు.. అమ్మలేని ప్రపంచం
బతుకులేని శూన్యంలా..
ఒంటరిగా మిగిలిన ఆస్థిపంజరంలా..
జ్ఞాపకాల ఎండమావులే
- డాక్టర్ పగిడిపల్లి సురేందర్
