- మాజీ సర్పంచ్ జటావత్ రాజు నాయక్.
- క్రీడాకారులకు క్రీడా దుస్తులను అందజేత.
- ఈ నెల 29 నుండి 31వరకు గోవాలో ట్చౌక్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలు.
జాతీయ స్థాయి క్రీడల్లో క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభను కనబరచి రాష్ట్రానికి, గ్రామానికి మంచి పేరు, ప్రతిష్టలు తీసుకురావాలని మాజీ సర్పంచ్ జటావత్ రాజు నాయక్ పేర్కొన్నారు. అఖిల భారత సీనియర్ జాతీయ ట్చౌక్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ నుంచి ఎంపికైన పురుషులు, మహిళల రాష్ట్ర జట్టులోని క్రీడాకారులకు నందిగామ మండల పరిధిలోని చాకలిదానిగుట్ట తండా గ్రామ మాజీ సర్పంచ్ జటావత్ రాజు నాయక్ క్రీడా దుస్తులను తన స్వంత ఖర్చులతో అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రాజు నాయక్ మాట్లాడుతూ జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనాలంటే క్రీడాకారుల్లో ఎంతో కఠోరమైన శిక్షణ, ఏకాగ్రత, ప్రశాంతమైన మనస్సు చాలా అవసరమని అన్నారు.జాతీయ స్థాయి క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరచి రాష్ట్రానికి, గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు,ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు,క్రీడాకారులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా తాను ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు.

అనంతరం రాష్ట్ర ట్చౌక్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు జటావత్ వసంత్ నాయక్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జరిగే ట్చౌక్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలకు తెలంగాణ రాష్ట్ర ట్చౌక్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పురుషులు మరియు మహిళల రాష్ట్ర జట్లు పాల్గొంటాయని, ఈ పోటీలు ఈ నెల 29 నుండి 31వరకు గోవాలోని మడ్గావ్‌లో జరుగుతాయన్నారు. క్రీడాకారులు మంచి ప్రతిభ కలిగి ఉన్నారని, ఖచ్చితంగా జాతీయ స్థాయిలో జరిగే ట్చౌక్‌బాల్ ఛాంపియన్‌షిప్ లో తెలంగాణ క్రీడాకారులు విజేతలుగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. వెంకటేష్,క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
