రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుండి పూర్తి స్థాయి కార్యకలాపాలు నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నది. కేవలం రెండు నెలల వ్యవధిలో ఏం సి ఎ ఆమోదం పొందడం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పి పి ఆర్ సి) పూర్తి చేయడం, కీలకంగా భావించే ఉద్యోగుల విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
క్షేత్ర స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించడానికి కీలకమైన ఆస్తుల విభజన లో భాగంగా మొదటిగా వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల సర్వే పై ద్రుష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 5.60 లక్షల వ్యవసాయ ట్రాన్సఫార్మర్లు వున్నాయి. సెక్షన్ కు మూడు టీం ల చొప్పున, 744 ఆపరేషన్ సెక్షన్ లలో అనగా 2232 టీం లు ప్రతి రోజు ఈ సర్వే లో పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. సర్వే కోసం రైతు డిస్కం ప్రత్యేక యాప్ రూపొందించింది. ఈ యాప్ ద్వారా అసిస్టెంట్ ఇంజినీర్లు తమ పరిధిలోని వ్యవసాయ డీటీఆర్‌లకు సంబంధించిన స్ట్రక్చర్, డి టి ఆర్ ఎంబోస్ నంబర్, నేమ్‌ప్లేట్ వివరాలను ఫోటోల రూపంలో సేకరించి, ఆయా ట్రాన్స్‌ఫార్మర్ల జియో కోఆర్డినేట్లను నమోదు చేయనున్నారు.
ఈ సందర్భముగా, ప్రభత్వ ఆదేశాల మేరకు తెలంగాణ డిస్కం ల సీఎండీలు, సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు డిస్కం పరిధిలోకి తీసుకురానున్న వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల (డి టి ఆర్ ఎస్) సర్వేపై విస్తృతంగా చర్చించారు. ఇప్పటికే రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో పైలట్ ప్రాతిపదికన కొన్ని వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల సర్వే విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.
ఈ నెల 28వ తేదీన గౌరవ విద్యుత్ నియంత్రణ కమిషన్ (ఇ ఆర్ సి) రైతు డిస్కంకు లైసెన్స్ మంజూరు అంశంపై బహిరంగ విచారణ నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే అసెట్ మ్యాపింగ్ ప్రక్రియ కూడా పూర్తయితే, ప్రభుత్వ నిర్ణయానుసారం జూన్ 2వ తేదీ నుండి రైతు డిస్కం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని సీఎండీ ముషారఫ్ ఫరూఖీ, వెల్లడించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ వరుణ్ రెడ్డి, ఐఏఎస్, డైరెక్టర్లు, డా. నరసింహులు, మోహన్ రావు, మధుసూదన్, శివాజీ, కృష్ణా రెడ్డి, తిరుపతి రెడ్డి, ఆర్ పి డి సి ఎల్ చీఫ్ ఇంజినీర్లు శ్రీ ఏ కామేష్, శ్రీ శ్రావణ్ కుమార్, ఇతర చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు, డివిజనల్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.
