- స్థానిక సంస్థల ఆర్థిక బలోపేతంపై చర్చలకు హాజరు
తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో(Delhi) జరగనున్న కీలక సమావేశానికి కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యతో పాటు కమిషన్ సభ్యులు మహమ్మద్ ఆసిఫ్ అలీ,కాకి రంగరాజ్,సుధీర్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీలోని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9న నిర్వహించనున్న సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్(Finance Commission) ప్రతినిధులు పాల్గొని పలు అంశాలపై చర్చించనున్నారు.
ముఖ్యంగా స్థానిక సంస్థల సామర్థ్య పెంపు, ఆర్థిక వనరుల సమీకరణ, పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే అంశాలపై సమావేశంలో చర్చలు జరిగే అవకాశం ఉంది.తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు అవసరమైన ఆర్థిక వనరులు,వాటి సమర్థవంతమైన వినియోగం,అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల సమీకరణ వంటి అంశాలపై సమావేశంలో అభిప్రాయాలను వెల్లడించనున్నట్లు సమాచారం.(epaper.aadabhyderabad.in)
ఈ సమావేశం ద్వారా స్థానిక సంస్థల ఆర్థిక స్వావలంబనకు సంబంధించి కేంద్ర స్థాయిలో అనుసరిస్తున్న విధానాలు,ఉత్తమ పద్ధతులపై అవగాహన కల్పించుకోవడంతో పాటు తెలంగాణకు అనుకూలమైన అంశాలను పరిశీలించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
